గువాహటి : ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ రాజ్యాంగానికి విరుద్ధంగా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్ గురువారం ఆరోపించారు. ‘రావత్ రాజకీయపరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య, లౌకిక విలువలపై ఏర్పాటైన మా పార్టీ బీజేపీకంటే వేగంగా ఎదిగితే ఆయనకెందుకు బాధ?’ అని అజ్మల్ ఓ ట్వీట్ చేశారు.
ఈశాన్య రాష్ట్రాల్లో ముస్లింల జనాభా పెరుగుతుండటంపై రావత్ బుధవారం మాట్లాడుతూ అస్సాంలో 1980ల్లో బీజేపీ ఎదిగిన దానికంటే వేగంగా ప్రస్తుతం అక్కడ ఏఐయూడీఎఫ్ ఎదుగుతోందని అన్నారు. రావత్ మాట్లాడిన దాంట్లో రాజకీయ, మతపరమైన అంశాలేవీ లేవని ఆర్మీ గురువారం పేర్కొంది. మరోవైపు రావత్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
సీపీఎం నాయకురాలు బృందా కారత్ మాట్లాడుతూ రావత్ వ్యాఖ్యలను ఆర్మీ సమర్థిస్తోందంటే వాటికి రక్షణ మంత్రి ఆమోదం ఉన్నట్లేనన్నారు. రావత్ రాజకీయాల గురించి కాకుండా సైన్యం గురించి ఆలోచించాలని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. కాగా, రావత్‌ను బీజేపీ వెనకేసుకొచ్చింది. అస్సాం మంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ రావత్ కొత్తగా మాట్లాడిందేమీ లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment