
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ దిగ్గజం ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారు. స్కూల్లో తనతో కలిసి చదువుకున్న వజ్రాల వ్యాపారి రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో ఆకాశ్ వివాహం ఈ ఏడాది డిసెంబర్ నెల మొదట్లో జరగనుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ పెళ్లి గురించి మాట్లాడుకోవడం కోసం ఇరు కుటుంబాలు, సన్నిహితులు తాజాగా(ఈ నెల 24న) గోవాలోని ఒక ఫైవ్‌స్టార్ రిసార్ట్‌లో కలుసుకున్నట్లు సమాచారం.
అయితే, నిశ్చితార్థం కూడా జరిగినట్లు వార్తలొస్తున్నాయి. గోవా కార్యక్రమానికి సంబంధించి ముకేశ్, రసెల్ మెహతా కుటుంబ సభ్యుల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఆకాశ్, శ్లోకా చేతిలో చేయివేసి నిలుచునున్న ఫొటో, శ్లోకాకు ముకేశ్ అంబానీ స్వీట్ తినిపిస్తున్న ఫొటో కూడా ఉంది. కార్యక్రమానికి ముకేశ్, నీతా అంబానీలతో పాటు ఆకాశ్ నాన్నమ్మ కోకిలాబెన్ కూడా హాజరయ్యారు.
కాగా, వివాహ ఉత్సవాలు 4–5 రోజుల పాటు ఉంటాయని, డిసెంబర్ 8–12 మధ్య ముంబైలోని ఒబెరాయ్ హోటల్ ఇందుకు వేదికయ్యే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, అధికారికంగా ఇరు కుటుంబాల నుంచి ఇంకా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.
రోజీ బ్లూ డైమండ్స్ అధిపతి రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతా, ఆకాశ్‌లు ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో కలిసి చదువుకున్నారు. ఇరు కుటుంబాలకు చాలా ఏళ్లుగా మంచి సాన్నిహిత్యం ఉంది. ముకేశ్ అంబానీకి ముగ్గురు సంతానం. వీరిలో కుమార్తె ఈషా, ఆకాశ్‌లు కవలలు. ఇక చిన్న కుమారుడు అనంత్ అంబానీ. ఆకాశ్ ఇప్పటికే రిలయన్స్ టెలికం వెంచర్ జియో డైరెక్టర్ల బోర్డులో ఉన్నారు.
రసెల్, మోనా మెహతాలకు ముగ్గురు సంతానం కాగా, శ్లోకా చిన్న కుమార్తె. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో ఆంత్రపాలజీ డిగ్రీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో న్యాయ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. స్వచ్ఛంద సంస్థలకు వాలంటీర్లను అందించే కనెక్ట్‌ఫర్ అనే సంస్థకు ఆమె సహ–వ్యవస్థాపకురాలు. కాగా శ్లోకా తల్లి మోనా మెహతాతో పీఎన్‌బీ రుణ కుంభకోణం ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి బంధుత్వం ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment