మోడీ అడుగుజాడల్లో యూపీ సీఎం
ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒక పార్టీ నాయకుడు జాతీయ స్థాయిలో దేశానికి అధినేత అయితే.. మరో పార్టీ నాయకుడు తమ రాష్ట్రానికే ముఖ్యమంత్రి. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కాస్తా దేశాధినేత అడుగుజాడల్లో నడుస్తున్నారు. అవును.. నరేంద్రమోడీ చెప్పినట్లుగానే, ఆయన బాటలోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇప్పుడు నడుస్తున్నారు. ఇదేంటనుకుంటున్నారా? తమ తమ మంత్రిత్వశాఖల విషయాలను ప్రజలకు చెప్పేందుకు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇంతకుముందు కేంద్ర మంత్రులందరికీ చెప్పిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు అఖిలేష్ యాదవ్ కూడా తమ మంత్రులు, ఎమ్మెల్యేలకు అదే పాఠం చెబుతున్నారు. రాజకీయంగా ముందంజలో ఉండాలంటే సోషల్ మీడియాను ఉపయోగించాలని వాళ్లందరికీ అఖిలేష్ తెలిపారు. రాష్ట్ర ఎమ్మెల్యేలకు నిర్వహించిన ఓ వర్క్షాప్లో ఆయనీ విషయం చెప్పారు. ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి వాటి ద్వారా పరిపాలనకు సంబంధించిన విషయాలను ప్రచారం చేసుకుని, పాలనలో అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని వాళ్లకు బోధించారు. అప్పుడే ప్రజలు కూడా తమ గురించి ఏమనుకుంటున్నారో వాళ్ల కామెంట్ల రూపంలో మనకు తెలుస్తుందని వివరించారు. ప్రజల అవసరాలు తెలుసుకోవాలన్నా కూడా ఇది చాలా ముఖ్యమన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా అనేకమంది నాయకులు ట్విట్టర్ను విస్తృతంగా ఉపయోగిస్తారని ట్విట్టర్ ఇండియా ప్రతినిధి రాహుల్ ఖుర్షీద్ చెప్పారు.