
ఎన్టీఆర్ ఆశయసాధనకే రాజీనామా: నందమూరి హరికృష్ణ
సాక్షి, న్యూఢిల్లీ: తన తండ్రి ఎన్టీఆర్ ఆశయసాధన కోసమే రాజీనామా చేసినట్టు రాజ్యసభ టీడీపీ సభ్యుడు నందమూరి హరికృష్ణ చెప్పారు. ఎవరిపైనా రాగద్వేషాల్లేవని, పదవులపై ఆకాంక్ష లేదని, మహానుభావుని బిడ్డగా వచ్చిన తను అంతర్లీనంగా ఆయన ప్రబోధానుసారం ముందుకు వెళ్తానని వెల్లడించారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనతో ఇరు ప్రాంతాల్లో కాంగ్రెస్ చిచ్చుపెట్టిందని ధ్వజమెత్తారు. సీమాంధ్రలో ఉద్యమాలకు కాంగ్రెస్‌దే బాధ్యతని చెప్పారు. రాహుల్‌ను ప్రధాని చేయడానికే ఒక భాష మాట్లాడే ప్రజలను అనైతికంగా విడగొట్టిందని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. తెలంగాణలో మెదక్ నుంచి నాడు పోటీ చేసిన ఇందిర ప్రధాని అయ్యారని, ఇప్పుడు ఆ స్థానం నుంచి రాహుల్‌ను ప్రధాని చేయడానికే విభజన నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.
రాష్ట్రాన్ని, ప్రజలను కాంగ్రెస్ విడదీసిన తీరు శకుని పాత్రలా ఉందని విమర్శించారు. రాష్ట్ర విభజన నిర్ణయం అనైతిక చర్య అని, దీన్ని అంగీకరించలేనని తెలిపారు. మిగిలిన టీడీపీ సీమాంధ్ర ఎంపీల రాజీనామాలపై ప్రశ్నించగా... ఎవరి రాజీనామా విషయాన్ని వారినే అడగాలని సలహా ఇచ్చారు. సీమాంధ్రకు న్యాయం చేయాలని టీడీపీ ఎంపీలు పోరాటాన్ని చేస్తున్నారని గుర్తుచేశారు. తెలంగాణపై వైఖరి చెప్పకుంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను అడ్డుకుంటామని ఓయూ జేఏసీ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. ‘‘కళకు భాషా భేదాలు లేవు. కాంగ్రెస్ పార్టీ చిచ్చు రగిల్చింది. మనమంతా దుష్టదుర్మార్గులపై పోరాడుదాం. అంతే కానీ ఈ ప్రాంతం వారు.. ఆ ప్రాంతంవారి సినిమాలను అడ్డుకుంటామనడం సరికాదు’’ అని బదులిచ్చారు.