
ఇండోర్/తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల్ని అనుమతించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ వ్యాఖ్యలు కేరళ కాంగ్రెస్ విభాగం వైఖరికి భిన్నంగా ఉన్నాయి. శబరిమల ఆలయంలోకి మహిళలందరూ ప్రవేశించొచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక కేరళలో ఆందోళనలు మొదలైన సంగతి తెలిసిందే. కోర్టు నిర్ణయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది.
ఇండోర్‌లో రాహుల్ మాట్లాడుతూ ‘శబరిమల ఆలయ ప్రవేశం సెంటిమెంట్‌తో కూడుకున్నది. ఈ విషయంలో నా అభిప్రాయాలు పార్టీ వైఖరికి భిన్నమైనవి. శబరిమల వివాదంలో నా దృష్టిలో స్త్రీ, పురుషులంతా ఒక్కటే. మహిళలందరికీ ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతివ్వాల్సిందే. కేరళీయుల అభిప్రాయాలకు అనుగుణంగా స్థానిక యూనిట్ వ్యవహరిస్తుంది’ అని అన్నారు. మరోవైపు, శబరిమల ఆందోళనకారుల అరెస్టుకు నిరసనగా బీజేపీ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. తిరువనంతపురంలో డీజీపీ ఆఫీస్ వద్ద బీజేపీ కార్యకర్తలు మంగళవారం నిరాహార దీక్ష చేపట్టారు. అన్ని జిల్లాల్లోనూ ఎస్పీ ఆఫీసుల వరకు ర్యాలీలు నిర్వహించారు.