త్వరలో 100 రూపాయిల కాయిన్: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : త్వరలో కొత్తగా వంద రూపాయిల కాయిన్లను విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎంజీ రామచంద్రన్ జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం రూ. 100, రూ. 5 నాణెలను ముద్రిస్తున్నట్లు పేర్కొంది. రూ. 100 కాయిన్ వ్యాసం 44 మిల్లీమీటర్లు ఉంటుందని తెలిపింది. రూ. 100 కాయిన్‌పై నాలుగు సింహాల అశోకుని స్థూపం ఉంటుందని వివరించింది.
వంద రూపాయిల కాయిన్ వెనుక భాగంలో ఎంజీ రామచంద్రన్ బొమ్మ ఉంటుందని తెలిపింది. కాయిన్ బరువు 35 గ్రాములు ఉంటుందని, దీన్ని తయారు చేయడానికి వెండి, రాగి, నికెల్, జింక్‌ల మిశ్రమాన్ని వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. 23 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో ఉండే రూ.5 కాయిన్ బరువు 6 గ్రాములు ఉంటుందని చెప్పింది. ఎంజీ రామచంద్రన్ జయంతి సందర్భంగా కాయిన్స్, పోస్టల్ స్టాంపులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.