సాక్షి, న్యూఢిల్లీ : కర్తార్‌పూర్ కారిడార్ పనులను పాకిస్తాన్ నిలిపివేసిందనే వార్తలపై పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370ను భారత్ రద్దు చేసిన నేపథ్యంలో కర్తార్‌పూర్ కారిడార్ పనుల్లో పాకిస్తాన్ జాప్యం చేస్తుండటం పట్ల కెప్టెన్ సింగ్ స్పందించారు. మరో మూడు నెలల్లో గురునానక్ 550వ జయంతోత్సవాలు జరగనున్న నేపథ్యంలో పనుల్లో జాప్యంతో ఈ చారిత్రక సందర్భానికి ప్రాజెక్టు పూర్తికాని పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నిర్ణయాలు ఇరు దేశాల ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ప్రభావం చూపరాదని ఆయన పాక్‌కు హితవు పలికారు.
ఈ ప్రాజెక్టు పనుల వేగవంతానికి సమావేశాలు నిర్వహించేందుకు పాకిస్తాన్‌కు భారత అధికారులు సమాచారం పంపారన్న వార్తల నేపథ్యంలో కెప్టెన్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్తార్‌పూర్ కారిడార్ పనులు పూర‍్తయితే పాక్‌లోని కర్తార్‌పూర్ దర్బార్ సాహిబ్ నుంచి పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లోని డేరాబాబా నానక్ ఆలయానికి సిక్కు యాత్రికులు వీసా రహిత ప్రయాణానికి మార్గం సుగమమవుతుంది. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు చేయడంతో భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్య, దౌత్య సంబంధాలను పాకిస్తాన్ తెంచుకోవడంతో కర్తార్‌పూర్ కారిడార్ పనులు చిక్కుల్లో పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment