అమెజాన్ లో మహిళా ఫోర్స్
కేరళ: కేరళ మహిళలు దేశంలోని మహిళల్లో ముందున్నారు. వారు మగవారితో సమానంగా ముందుకు దూసుకెళుతున్నారు. వారితో ఆన్‌లైన్ వ్యాపార సంస్థ అమెజాన్ ఓ ప్రయోగం చేయాలనుకొంది. ఏడుగురు మహిళతో దేశంలోనే మొట్టమొదటి సారిగా అసైన్‌మెంట్ డెలివరి స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. వినియోగదారుల నుంచి ఆర్డర్లు తీసుకోవడం, సకాలంలో వాటిని టూవీలర్‌పై తీసుకెళ్లి డెలివరి చేయడం వారి విధి. ఇంతవరకు మగవారికే పరిమితమైన ఈ డ్యూటీ మూటను వారు భుజానకెత్తుకున్నారు. తాము కూడా మగవారికి ఏ మాత్రం తీసిపోమని నిరూపించారు.
వారి పని విధానాన్ని చూసిన యాజమాన్యం కూడా వారిని ఎంతో ప్రశంసిస్తోంది. ఏడుగురు మహిళలతో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ప్రత్యేక డెలివరి స్టేషన్ అద్భుతంగా పనిచేస్తోందని యాజమాన్యం చెబుతోంది. వివిధ వస్తువులతో కూడిన బరువైన బ్యాగ్‌ను మోసుకొని టూ వీలర్‌పై డెలివరికి వెళ్లడం అంత సులభమైన డ్యూటీ ఏమీ కాదని, ఈ విషయంలో తాము తీసుకున్న ఏడుగురు మహిళలు రాణించడం చూసిన మహిళలు తమను కూడా ఇలాంటి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తులు అనేకం వస్తున్నాయని యాజవాన్యం తెలిపింది. తాము వ్యాపార విస్తరణనుబట్టి వీలైనంత మంది మహిళలను తీసుకునేందుకు ప్రయత్నిస్తామని, అంతర్జాతీయ అమెజాన్ స్టేషన్ మేనేజర్ దివ్యా తెలిపారు.
ఇంతకాలం మగవాళ్లు చేస్తున్న ఈ డెలివరి జాబ్‌ను చేయడం ఎలా అంటూ తొలుత కొంత సందేహించిన మాట వాస్తవమేనని, అయితే డ్యూటీ వేళలు అనుకూలంగా ఉండడంతో ఉద్యోగానికి సిద్ధ పడ్డామని 37 ఏళ్ల దీప్తి ప్రమోద్ తెలిపారు. రోజుకు మూడు, నాలుగు కిలీమీటర్ల పరిధిలో 40 సార్లు వస్తువులను డెలివరి చేస్తామని ఎం. సంధ్యా అనే 34 ఏళ్ల యువతి చెప్పారు.