అగ్రరాజ్యం అమెరికాతో భారత్ చారిత్రక భేటీకి రంగం సిద్ధమైంది. గురువారం ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశంరెండుదేశాల మధ్య సంబంధాల్లో నూతన అధ్యాయానికి తెరతీయనుంది. ఈ చర్చల రూపంలో ఈ ఏడాది ఇరుదేశాల మధ్య అత్యున్నతస్థాయి రాజకీయ, దౌత్యపరమైన సంబంధాలపై సంప్రదింపుల పర్వం మొదలుకావడానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. అమెరికా విదేశాంగ మంత్రి మైకిల్ ఆర్ పాంపే, రక్షణశాఖ మంత్రి జేమ్స్ మాటీస్‌తో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలకచర్చలు సాగించనున్నారు. వివిధదేశాలపై ఆంక్షలు విధించడం ద్వారా అమెరికా ఇప్పటికే ప్రపంచస్థాయిలో పరోక్ష వాణిజ్యయుద్ధానికి తెరతీసిన నేపథ్యంలో భారత్‌దేశంతో ముడిపడిన అంశాల విషయంలో ఆ దేశం ఎలాంటి వైఖరిని తీసుకోబోతున్నదో స్పష్టం కానుంది.
భద్రతా, రాజకీయపరమైన అంశాలు, వాటితో ముడిపడిన వివిధ విషయాలపై అమెరికా–భారత్‌లకు చెందిన∙విదేశాంగ,రక్షణ శాఖ మంత్రులు చర్చలు జరపడాన్నే 2 ప్లస్ 2 సంప్రదింపులు అని పిలుస్తున్నారు. ఈ ఏడాది ఇరుదేశాల మధ్య జరగాల్సిన ఈ కీలక భేటీ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది
కాట్సా కింద ఆంక్షలు...
‘కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్‌సరీస్ థ్రూ సాంక్షన్స్‌యాక్ట్ ’ (కాట్సా) కింద రష్యాపై అమెరికా సైనికపరమైన ఆంక్షలు విధించిన నేపథ్యంలో, రక్షణ వ్యవహారాల్లో రష్యాతో ఒప్పందం చేసుకునే దేశాలపైనా ఈ ఆంక్షలు వర్తించే అవకాశాలున్నాయి. రష్యా నుంచి సుదూర లక్ష్యాలు చేధించే ఎస్–400 అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ కొనుగోలుకే భారత్ కట్టుబడిన నేపథ్యంలో ఈ చర్చల్లో భాగంగా దీనిపై అమెరికా స్పందన ఏ విధంగా ఉండబోతుందనేది కీలకంగా మారింది. కాట్సా నుంచి భారత్‌ను మినహాయించే అవకాశాలపై పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియా–పసిఫిక్ ప్రాంతంపై అమెరికా తన పట్టు కొనసాగించేందుకు భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగించాల్సిన అవసరమంది. ఈ నేపథ్యంలో కాట్సా చట్టం అమల్లో భారత్‌కు మినహాయింపులు ఇవ్వొచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నా, రష్యాతో ఎస్–400 క్షిపణి రక్షణ వ్యవస్థలు, ఇతర ఆయుధాల కొనుగోలులో భారత్‌పై ఆంక్షల్లో మినహాయింపుపై గ్యారంటీ ఇవ్వలేమని అమెరికా రక్షణశాఖ అధికారి రాండల్ ష్రివర్ చెబుతున్నారు. అయితే ఇరుదేశాల మధ్య దౌత్య, రక్షణపరమైన అంశాల్లో మరింత మెరుగైన సంబంధాల కల్పనకు ఈ చర్చలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని ఇటీవలే అమెరికాస్పష్టంచేసింది. భారత్ మాత్రం రష్యా క్షిపణులు కొనుగోలు విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేయబోతోంది.
ఇరాన్ చమురు గొడవ...
కాట్సా తరువాత భారత్–అమెరికా మధ్య తలెత్తిన మరో వివాదం ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోవడం. ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి వైదొలిగిన తరువాత అమెరికా ఆ దేశంపై ఆంక్షలు విధించింది. అంతే కాదు ఇరాన్ నుంచి చమురు దేశాల దిగుమతిని పూర్తిస్థాయిలో నిలిపేయాలని ఇతరదేశాలను కోరుతోంది. భారత్ దిగుమతి చేసుకునే చమురులో నాలుగోవంతు ఇరాన్ నుంచే వస్తుంది. ఇప్పడు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే అంత మొత్తంలో అదే ధరకు లభించడం కష్టం అన్నది భారత్ వాదన. పైగా ఇరాన్‌లో భారత్ చేపడుతున్న చాబహర్ పోర్టు నిర్మాణం విషయంలో కూడా అమెరికాకు అభ్యంతరాలు ఉన్నాయి. దైపాక్షిక భేటీలో ఈ అంశం చర్చకు వచ్చినపుడు అన్ని కోణాల నుంచి చర్చించి నిర్ణయం తీసుకోవాలని భారత్ భావిస్తోంది.
చైనాతో సంబంధాల పైనా...
చైనా వస్తువులపై భారీగా టారిఫ్ పెంచి ట్రేడ్‌వార్‌కు తెరతీసిన అమెరికా ఇప్పుడు ఇండొ పసిఫిక్ సముద్రంపై చైనా పెత్తనాన్ని సవాల్ చేయడానికి భారత్ సాయం కోరుతోంది. అయితే డొకాŠల్‌మ్ వివాదం తరువాత భారత్–చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇటీవల జరిగిన వూహన్ భేటీలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రెండుదేశాల మధ్య స్నేహసంబంధాలను మరింత పునరుద్ధరించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టు + టు సమావేశంలో భారత్ ఆచితూచి అడుగులు వేసే అవకాశం ఉంది. ఇది కాకుండా అమెరికా నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం దిగుమతి చేసుకునే విషయంలో ఉన్న అడ్డంకులను తొలగించాల్సిందిగా భారత్ కోరవచ్చు. కమ్యూనికేషన్స్, వ్యూహాత్మక పరిజ్ఞానం వంటి విషయాల్లో అమెరికా సాయాన్ని భారత్ ఆశిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment