ఉద్రిక్తతల నడుమ భారత నేవి భారీ డ్రిల్
న్యూఢిల్లీ: సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత ఆర్మీ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధమౌతోంది. సర్జికల్ దాడుల అనంతరం పాక్ వైపు నుంచి కాల్పుల ఉల్లంఘనలు పెరగడంతో పాటు.. గురువారం ఉదయం నుంచి పాక్ సైన్యం ఎల్‌ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారీ స్ధాయిలో కాల్పులకు దిగుతోంది. ఈ దాడులను భారత సైన్యం ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొడుతూనే ఉంది. అయితే నవంబర్ చివర్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ పదవికాలం ముగియనుండటంతో.. ఈ లోపు పాక్ ఏదైనా దుందుడుకు చర్యలకు పాల్పడే అవకాశం లేకపోలేదని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దీంతో భారత సైన్యం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఆర్మీ, వాయుసేన పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండగా.. ఇప్పుడు ఇండియన్ నేవి సైతం అరెబియా సముద్రంలో 'పశ్చిమ్ లెహర్' పేరుతో భారీస్థాయిలో విన్యాసాలకు సిద్ధమౌతోంది. 40కి పైగా వార్‌షిప్‌లు, సబ్‌మెరైన్‌లు, మెరిటైమ్ ఫైటర్ జెట్‌లు, గస్తీ ఎయిర్ క్రాఫ్ట్స్, డ్రోన్‌లతో నౌకాదళం ఈ విన్యాసాలను నవంబర్ 2 నుంచి 14 వరకు నిర్వహించనుంది.