
న్యూఢిల్లీ: జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్), జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ) గురించి దుష్ప్రచారం చేసే వారి వల్ల మైనార్టీలు, పేదలకు నష్టం కలుగుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్(యూపీఏ) ప్రభుత్వ హయాంలోనే ఎన్‌పీఆర్ రూపొందించారని పేర్కొన్నారు. 2015లో చేపట్టిన ఇంటింటి సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్- ఎన్‌పీఆర్)ను నవీకరించే ప్రక్రియకు... కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. కాగా దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ)కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ... ఎన్‌పీఆర్ పూర్తయి, అధికారిక ముద్రణ తర్వాత ప్రభుత్వం.. దీనినే ఎన్నార్సీకి ఆధారంగా చేసుకుంటుందన్న వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్‌పీఆర్‌కు, ఎన్నార్సీకి ఎటువంటి సంబంధం లేదని అమిత్ షా స్పష్టం చేశారు.(చదవండి : ఎన్‌పీఆర్ అంటే ఏంటి.. ఆ రాష్ట్రానికి ఎందుకు మినహాయింపు?)
వార్తా సంస్థ ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘ఎన్నార్సీపై పార్లమెంటులో, కేంద్ర మంత్రివర్గంలో చర్చ జరగలేదు. మీరు దేశ పౌరులా కాదా అనే ప్రశ్నలు ఎన్‌ఆర్‌పీలో ఉండవు. నిజానికి యూపీఏ హయాంలోనే ఎన్‌ఆర్‌పీ రూపొందించారు. కానీ అప్పుడు ఎవరూ దీనిపై ప్రశ్నించలేదు. ఇప్పుడెందుకు అడుగుతున్నారు. అదే విధంగా పౌరసత్వ సవరణ చట్టం ఎవరి పౌరసత్వాన్ని లాక్కునే ప్రస్తావన లేదు. కేరళ, బెంగాల్ వంటి పేద రాష్ట్రాలకు ఇదెంతో ఉపయోగకరం. సీఏఏను వ్యతిరేకించాలన్న ఉద్దేశాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పునఃపరిశీలించాలి. ఎన్‌పీఆర్ విషయంలో కాంగ్రెస్ తీసుకువచ్చిన ప్రక్రియనే మేం కొనసాగిస్తున్నాం. ఎన్‌పీఆర్ కోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించాం. ఎన్‌పీఆర్‌లో ఆధార్, ఓటరు నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరాలు సేకరించడంలో ఎలాంటి తప్పు లేదు’ అని అమిత్ షా పేర్కొన్నారు.(చదవండి : పౌరసత్వ చట్టం: ఎందుకీ ఆందోళనలు?)
Comments
Please login to add a commentAdd a comment