
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందంపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ చీఫ్ అమిత్ షా డిమాండ్ చేశారు. రాఫెల్ ఒప్పందంలో ఎవరికీ ఆర్థిక లబ్ధి చేకూరలేదని కోర్టు స్పష్టం చేసిందన్నారు. సుప్రీం తీర్పును తాము స్వాగతిస్తున్నామన్నారు. అసత్యాలు ప్రచారం చేసిన వారికి తీర్పు చెంపదెబ్బ వంటిదని, చివరకు సత్యం గెలిచిందని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అమిత్ షా పేర్కొన్నారు.
రాఫెల్ డీల్‌పై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని కోర్టు పేర్కొందని ఆయన చెప్పారు. ఈ ఒప్పందంపై దేశాన్ని తప్పుదారి పట్టించినందుకు రాహుల్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాఫెల్ విమానాల ధరల వల్ల దేశానికి లాభమే చేకూరిందని, కాంగ్రెస్ మాత్రం అబద్దాన్ని పదేపదే ప్రచారం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో రూ 15 లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడిందని అమిత్ షా విమర్శించారు. కాపలాదారును దొంగలా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment