
11 నెలలకే పెళ్ళి చేశారు..!
పద్ధెనిమిదేళ్ళ తర్వాత ఆమె స్వతంత్రం సంపాదించుకుంది. కేవలం పదకొండు నెలల ప్రాయంలోనే పెద్దలు బాల్య వివాహం జరుపగా... రెండేళ్ళ క్రితమే ఆమెకు అసలు విషయం తెలిసింది. ఉపాధ్యాయని కావాలని కలలు కన్న ఆమె... పెళ్ళి రద్దుకోసం 19 ఏళ్ళ వయసులో పోరాటం మొదలు పెట్టింది. ఎట్టకేలకు వివాహాన్ని రద్దు చేస్తూ కోర్టు తీర్పునివ్వడంతో ఊపిరి పీల్చుకుంది. జోధ్ పూర్ స్థానిక ఫ్యామిలీ కోర్టు ఆమె వివాహాన్ని రద్దు చేస్తూ అక్టోబర్ 20న ఆదేశాలు జారీ చేసింది. ఇది నా జీవితంలో అద్భుతమైన రోజు అంటూ తన భవిష్యత్ కలను సాకారం చేసుకునేందుకు కృషి ప్రారంభించింది.
రాజస్థాన్ తూర్పు ప్రాంతంలోని జోధ్ పూర్ కు చెందిన 19 ఏళ్ళ శాంతాదేవి మేఘ్వాల్.. గురువు కావాలని కలలు కంది. తన వివాహం రద్దు చేయమంటూ మే నెలలో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. అది విన్న ఆమె భర్త, కుటుంబ సభ్యులు... స్థానిక పంచాయితీకి తెలిపారు. పురాతర సంప్రదాయాన్ని వ్యతిరేకించినందుకు ఆమె... కులబహిష్కరణకు గురవ్వడమే కాక, సుమారు 16 లక్షల రూపాయలు జరిమానా కూడ కట్టాల్సి వచ్చింది.
తెలిసీ తెలియని ఆ వయసులో ఆమెకు.. చిన్నప్పుడే 28 ఏళ్ళ శాంతారామ్ తో పెళ్ళి జరిగిందని తెలిసింది. ''మా నాన్నగ్రామ పెద్దలకు చెప్తున్నప్పుడు విన్నాను. శాంతాదేవికి పదకొండు నెలల వయసులోనే పెళ్ళి చేశామని, ఇప్పుడు ఆమెను అత్తారింటికి పంపించాలని అన్నారు. అంతేకాదు ఆమె ఈ వివాహాన్ని అంగీకరిస్తుందని, తర్వాత ఆమె జాతకం ఎలా ఉంటే అలా జరుగుతుందని కూడ మా తల్లిదండ్రులు వారితో చెప్పడం విన్నాను. వెంటనే గ్రామంలోని స్వచ్ఛంద సంస్థకు చెందిన బాల్య వివాహాల కార్యకర్తను ఆశ్రయించాను. కమ్యూనిటీకి వ్యతిరేకంగా పోరాడి చివరకు గెలిచాను'' అంటుంది శాంతాదేవి.
బెదిరింపులు, ఒత్తిళ్ళను ధైర్యంగా ఎదుర్కొనేందుకు శాంతాదేవి సార్థి ట్రస్ట్ ను ఆశ్రయించింది. బాలల హక్కులను కాపాడేందుకు 26 ఏళ్ళ కృతి భారతి ఈ సంస్థను స్థాపించారు. ఇప్పటికే దేశంలో సుమారు 29 బాల్య వివాహాలను రద్దు చేయించారు. కృతి భారతి సహా ఆమె ట్రస్ట్ సభ్యులు.. ముందుగా శాంతాదేవి తండ్రి.. పద్మారామ్ మేఘ్వాల్ కు అవగాహన కల్పించారు. దీంతో శాంతా దేవి తల్లిదండ్రులు వారు చేస్తున్నది తప్పు అని గ్రహించగలిగారు. అంతేకాదు తమ సంఘంలోని కొంతమంది సపోర్ట్ తో శాంతాదేవి వివాహం రద్దు చేయించేందుకు ప్రయత్నించారు.
బాల్యవివాహాల్లో అత్యధిక శాతం భారత దేశంలోని రాజస్థాన్ లో జరుగుతున్నట్లు లెక్కలు చెప్తున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ ఆచారం అమల్లో ఉన్నప్పటికీ.. రాజస్థాన్ ఏకంగా ప్రపంచంలోనే బాల్యవివాహాల్లో రెండవ అత్యధిక స్థానంలో ఉన్న రాష్ట్రంగా ప్రకటించారు. 1929 నుంచే బాల్య వివాహాలు చట్టప్రకారం నిషేధించినా... రాజస్థాన్ లోని గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. కృతి భారతి వంటి ఎందరో అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నా, వివాహాలను అడ్డుకుంటున్నా... అక్కడి ప్రజల్లో చైతన్యం అంతంత మాత్రంగానే ఉంది. ఇటువంటి ప్రాంతాల్లో ఎన్జీవోలు, న్యాయవాదులు, ప్రజాసేవకులు మరింత అవగాహన కల్పించి బాల్య వివాహాలను నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.