చెన్నై: తమిళనాడులో తండ్రి కొడుకుల కస్టడీ మృతిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు హింసించడంతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తానుకులం ప్రాంతానికి చెందిన జయరాజ్(59), ఆయన కొడుకు బెనిక్స్(31) మరణించినట్టు ఆరోపణలు వచ్చాయి. వీరి మరణానికి కారకులైన దోషులను చట్టప్రకారం శిక్షించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. సోషల్ మీడియాలోనూ #JusticeForJayarajandBennicks హ్యష్‌టాగ్‌తో ప్రముఖులు, నెటిజనులు న్యాయం కోసం నినదిస్తున్నారు.
మాకు వాస్తవాలు కావాలి
‘జయరాజ్, బెనిక్స్ మరణవార్త విని హతశురాలిని అయ్యాను. చాలా కోపం వచ్చింది. ఇలాంటి క్రూరత్వానికి ఎవరూ పాల్పడరాదు. దోషులు తప్పించుకోకుండా చూడాలి. మాకు వాస్తవాలు కావాలి. ఇద్దరిని కోల్పోయిన మృతుల కుటుంబ సభ్యుల బాధను ఊహించడానికి కూడా సాహసించలేకపోతున్నాను. వారికి న్యాయం జరిగే వరకు మనమంతా సమైక్యంగా #JusticeForJayarajandBennicks హ్యష్‌టాగ్‌తో గళం వినిపిద్దామ’ని ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా ట్వీట్ చేశారు.
హృదయ విదారకం
గుజరాత్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని ఈ సంఘటనను అమెరికాలో ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యతో పోల్చారు. ‘ప్రియమైన బాలీవుడ్ ప్రముఖులారా, తమిళనాడులో ఏం జరిగిందో మీరు విన్నారా లేదా మీ ఇన్‌స్టాగ్రామ్ యాక్టివిజం ఇతర దేశాలకు మాత్రమే విస్తరించిందా? జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఇటువంటి పోలీసు హింస, లైంగిక వేధింపుల కథ హృదయ విదారకం’ అంటూ మేవాని ట్వీట్ చేశారు. (‘మై డాడీ ఛేంజ్డ్ ద వరల్ట్’)
తమిళనాడు పోలీసుల కస్టడీలో తండ్రి, కొడుకుల మృతిపై ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధవన్ కూడా ట్విటర్‌లో స్పందించాడు. ‘తమిళనాడులో జయరాజ్, బెనిక్స్ పై జరిగిన దారుణం గురించి విని భయపడ్డాను. మృతుల కుటుంబానికి న్యాయం జరిగేలా మనమంతా బలంగా గళం విన్పించాల’ని ధవన్ ట్విటర్‌లో పేర్కొన్నాడు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, ఈ అమానవీయ చర్యకు పాల్పడిన వారిని శిక్షించి.. బాధితులకు న్యాయం చేయాలని తమిళ హీరో జయం రవి ట్విటర్‌లో డిమాండ్ చేశారు.
అసలేం జరిగింది?
అనుమతించిన సమయానికి మించి తమ మొబైల్ దుకాణాన్ని తెరిచివుంచారన్న కారణంతో పి జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్‌ను గత శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల తర్వాత ఆసుపత్రిలో వారిద్దరూ ఒకరి తర్వాత ఒకరు మరణించారు. సాత్తానుకులం పోలీస్‌స్టేషన్‌లో పోలీసు సిబ్బంది తీవ్రంగా కొట్టడం వల్లే జయరాజ్, అతడి కొడుకు చనిపోయారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, తాము అడిగిన సెల్‌ఫోన్లను ఇవ్వలేదన్న అక్కసుతోనే జయరాజ్, బెనిక్స్‌లపై పోలీసులు దాష్టీకాన్ని ప్రదర్శించినట్టు విచారణలో వెల్లడైంది. తండ్రి కొడుకుల లాకప్‌డెత్‌కు నిరసగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వర్తకులు దుకాణాల బంద్ పాటించారు. జయరాజ్, బెనిక్స్‌లను కొట్టి చంపిన పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కస్టడీ మరణాలను
తీవ్రంగా పరిగణించిన మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ఈ ఘటనపై మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది. (‘సెల్’ కోసమే దాష్టీకమా?)
Comments
Please login to add a commentAdd a comment