
'కోపం వస్తోంది.. గుండె పగిలిపోతోంది'
ఫ్రాన్స్ లోని నీస్ నగరంలో జరిగిన ఉగ్రవాద దాడిని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్రంగా ఖండించారు.
ముంబై: ఫ్రాన్స్ లోని నీస్ నగరంలో జరిగిన ఉగ్రవాద దాడిని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముష్కరుల మతిమాలిన చర్యను గర్హిస్తూ ట్విట్టర్ లో కామెంట్లు పోస్ట్ చేశారు. దర్శకుడు సాజిద్ ఖాన్, మీడియా ప్రముఖులు రాజ్దీప్ సర్దేశాయ్, బర్కాదత్ సహా పలువురు సెలబ్రిటీలు నీస్ ఉగ్రదాడి బాధితులకు బాసటగా నిలుస్తూ సందేశాలు పెట్టారు.
'ఉదయం లేవగానే విషాద వార్త తెలిసింది. హృదయం ద్రవించిపోతోంది. గతేడాది నేను అక్కడ ఉన్నా. నీస్ నగరం చాలా అందమైన ప్రాంతం. అక్కడి ప్రజలు చాలా మంచివారు. మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నా'నని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పేర్కొన్నాడు.
'నీస్ దాడి తీవ్రవాదం సృష్టించిన క్రూరమైన చర్య. మరో ఉగ్రదాడితో ఫ్రాన్స్ ప్రజలు షాక్ తిన్నాడు. బాధితులు వెంటనే కోలుకోవాలని కోరుకుంటున్నా'నని హీరోయిన్ బిపాసా బసు తెలిపింది.
'అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. షాక్కు గురయ్యాను. కోపం వస్తోంది. గుండె పగిలిపోతోంది. గత నెలలో నేను నీస్ నగరంలో ఉన్నాను. బాధిత కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాల'ని బ్రిటీష్ నటి, గాయని సోఫీ చౌద్రి వెల్లడించింది.
'నీస్ ఉగ్రదాడి గురించి విని దిగ్భ్రాంతికి లోనయ్యాను. అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగింది. హృదయం ద్రవీస్తోంది. భయానక దాడికి గురైన బాధితుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నా'నని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యానించాడు.
More innocent lives lost..Shocked, angry, heartbroken! Was in #Nice last month! All my prayers for the families. Restez fort. #NiceAttack
— SOPHIE CHOUDRY (@Sophie_Choudry) 15 July 2016