అదే స్కూల్లోకి మరో చిరుత!
అదే ఊరు.. అదే స్కూలు.. మరో చిరుత! అవును.. బెంగళూరులో నిన్న కాక మొన్న స్కూల్లోకి ఓ చిరుత వచ్చి నానా హడావుడి చేసి చివరకు తోక ముడిచి వెళ్లిపోయిన సంగతి గుర్తుండే ఉంటుంది కదూ. ఇప్పుడు కూడా సరిగ్గా మళ్లీ అదే స్కూల్లోకి మరో చిరుత మంగళవారం ప్రవేశించింది. ఒక చిరుత అక్కడకు వచ్చిన విషయం తాను కూడా కచ్చితంగా చెప్పగలనని, అయితే స్థానికులు మాత్రం తాము రెండు చిరుతలను చూసినట్లు చెబుతున్నారని అటవీ శాఖాధికారి ఒకరు చెప్పారు. ఉదయం 9.30 -10 గంటల మధ్యలో ఆ చిరుత వచ్చిందన్నారు.
అయితే.. చిరుతను పట్టుకోడానికి రాత్రిపూట మాత్రం ఎలాంటి ఆపరేషన్ చేసేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఉదయం దాన్ని పట్టుకునే ప్రయత్నాలు చేస్తామన్నారు. స్థానికులంతా తమ ఇళ్ల తలుపులు, కిటికీలు గట్టిగా వేసుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చిరుత ఎక్కడుందో తెలియకపోవడంతో స్కూలుకు బుధవారం సెలవు ప్రకటించారు. విబ్జ్‌యార్ స్కూల్లోకి ఈనెల 7వ తేదీన ఒక చిరుత ప్రవేశించి, అటవీ శాఖాధికారులను గాయపరిచింది. తర్వాత దానికి మత్తు మందు ఇచ్చి పట్టుకున్నారు. ఇప్పుడు మరి దాన్ని వెతుక్కుంటూ వచ్చిందో.. లేక దీంతనట ఇదే వచ్చిందో గానీ మరో చిరుత మాత్రం కచ్చితంగా అదే స్కూల్లోకి ప్రవేశించింది.