'వరకట్న చట్టాలు దురుపయోగమౌతున్నాయి'
వరకట్న చట్టాలు దురుపయోగమవుతున్నాయని సుప్రీం కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో అరెస్టులు చేయకూడదని, అలా చేయాల్సి వస్తే దానికి గల కారణాలను కోర్టుకు వివరించాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
వరకట్న వేధింపుల చట్టం కింద ఏడేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అయితే అరెస్టు చేయడానికి సహేతుకమైన కారణాలున్నాయా లేదా అన్నది రూఢి చేసుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది.
పలు సందర్బాల్లో మంచానికే పరిమితమైన అత్త మామలు, ఏళ్ల తరబడి విదేశాల్లో ఉంటున్న ఆడబిడ్డలపై కూడా వరకట్న వేధింపు కేసులు నమోదవడాన్ని కూడా సుప్రీం కోర్టు తప్పు పట్టింది. దీన్ని ఒక ఆయుధంగా వాడుకుని కక్షసాధింపుకు పాల్పడటం సరైనది కాదని కోర్టు అభిప్రాయపడింది. మహిళలకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ఈ చట్టం వల్ల అరెస్టయ్యే వారిలో నాలుగో వంతు మహిళలే కావడం గమనార్హమని కూడా కోర్టు పేర్కొంది. ఇలా చట్టాన్ని దురుపయోగం చేయడం దురహంకారపూరితం. వీటిని న్యాయస్థానాలు అదుపుచేయాలని సర్వోచ్చ న్యాయస్థానం వ్యాఖ్యానించింది.