ఎన్నిసార్లు అయినా ఇక్కడ పర్యటిస్తా
- లోయలో పరిస్థితి మెరుగుపడింది
- ఇంకా మార్పు రావాలి
- 18 లోపు వారిని బాల నేరస్థులుగానే చూడాలి
- హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్
సాక్షి, శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపరిచేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తున్నట్లు కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. సోమవారం ఆయన శ్రీనగర్‌లో సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ అనంతరం విలేకరులతో మాట్లాడారు. కశ్మీర్‌లో సుదీర్ఘకాలంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రతిఒక్కరినీ కలుస్తామని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు.
లోయలో ప్రజాశ్రేయస్సుకోసం, శాంతిని నెలకొల్పేందుకు అవసరమైతే ఏడాదిలో 50 సార్లు అయినా ఇక్కడ పర్యటిస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం లోయలో పరిస్థితులు కుదరుకున్నాయని చెప్పిన ఆయన.. ఇంతకన్నా మంచి రోజులు రావాలని అన్నారు. కశ్మీర్‌లో 18 ఏళ్లలోపు వారు నేరం చేసుంటే బాల నేరస్థులగా పరిగణించాలని.. నేరస్థులుగా చూడవద్దని ఆయన భద్రతాదళాలకు చెప్పారు. వారిని దర్యాప్తు చేయాల్సివస్తే.. జువైనల్ యాక్ట్‌కిందనే దర్యాప్తు చేయాలని, నేరం రుజువైతే జైళ్లకు కాకుండా జువైనల్ హోమ్స్‌కు పంపాలని ఆదేశించారు. కశ్మీర్‌లో టూరిజాన్ని పెంచేందుకు కేంద్రం స్పెషల్ ప్రమోషనల్ డ్రైవ్‌ను నిర్వహిస్తుందని చెప్పారు.
5 సీ ఫార్ములా
కశ్మీర్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి శాశ్వత పరిష్కారంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ 5 సీ ఫార్ములాను పేర్కొన్నారు. కశ్మీరీలందరూ 5 సీ ఫార్ములాను అనుసరిస్తే.. సమస్యలు దరి చేరవని చెప్పారు. 5సీ ఫార్ములాలో మొదటిది కంపాషన్ (జాలి, దయాభావం), రెండోది కమ్యూనికేషన్, మూడోది కో-ఎగ్జిస్టెన్స్ (సహజీవనం), నాలుగవది కాన్ఫిడెన్స్ బిల్డింగ్ (ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం), చివరది కన్సిస్టెన్సీ (నిబద్ధత).. వీటిని ప్రతి కశ్మీరీ పెంచుకోవాలని రాజ్‌నాథ్ సూచించారు.