కారం బాంబులకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ : కశ్మీర్ లోయలో పెల్లెట్ గన్లకు ప్రత్యామ్నాయంగా కారం నింపిన గ్రెనేడ్లు (కారం బాంబులు), 'పవా షెల్స్' ఉపయోగించేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కశ్మీర్‌లో ఆందోళనకారుల మీద పెల్లెట్ల ప్రయోగంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కాగా రాజ్నాథ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష బృందం ఆదివారం కశ్మీర్ పర్యటించనున్న విషయం తెలిసిందే. అఖిలపక్ష నేతలు ప్రజలు, సంస్థల్ని కలసి పరిస్థితిపై వివరాలు సేకరిస్తుంది. వేర్పాటువాద నేతల్ని కలిసేందుకు అఖిలపక్ష నేతలకు స్వేచ్ఛ ఉండడంతో వారితో చర్చించే అవకాశముంది. ఈ నేపథ్యంలో పవా షెల్స్ వాడకంపై రాజ్నాథ్ ఆమోదం తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పెల్లెట్ గన్లకు బదులు.. నోనివామైడ్ అని పిలిచే పెలార్గానిక్ యాసిడ్ వానిలైల్ అమైడ్ (పవా)తో పాటు.. స్టన్ లాక్ షెల్స్, లాంగ్ రేంజ్ అకోస్టిక్ డివైజ్ (లార్డ్) వంటి ప్రాణాంతకం కాని మందుగుండును పెల్లెట్ గన్లకు ప్రత్యామ్నాయంగా వినియోగించవచ్చునని నిపుణుల కమిటీ కేంద్ర హోంశాఖకు సూచించిన విషయం విదితమే. కాగా కొత్తగా అభివృద్ధి చేసిన ఈ షెల్స్ పనితీరును ఇటీవలే ఢిల్లీలోని పరీక్షా కేంద్రంలో కమిటీ పరిశీలించింది.
ఏమిటీ పవా షెల్స్: పవా మరోపేరు నోనివమైడ్. మిరపకాయలో ఈ రసాయనిక పదార్థం లభ్యమవుతుంది. స్కొవిల్లే స్కేల్(మిరపఘాటును లెక్కించే కొలమానం)పై పవాది గరిష్ట స్థాయి. ఇది మనుషులను తీవ్రంగా చికాకు పెట్టడంతో పాటు గుంపుల్ని చెదరగొడుతుంది. ఘాటైన వాసన, కారంగా ఉండేందుకు ఆహార పదార్థాల్లో కూడా వాడతారు. ప్రయోగించగానే షెల్స్ పేలి శత్రువును తాత్కాలికంగా నిరోధిస్తుంది, అల్లరిమూకల్ని చెల్లాచెదురు చేస్తుంది. టియర్ గ్యాస్ షెల్, పెప్పర్ స్ప్రే కంటే ప్రభావంతంగా పనిచేస్తుంది.
గ్వాలియర్‌లో తక్షణం తయారీ: ఈ షెల్స్‌పై ఏడాదిగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ (లక్నో)లో పరిశోధనలు నిర్వహించారు. కశ్మీర్ హింసాకాండ సమయంలోనే పూర్తి ఫలితం అందుబాటులోకి వచ్చింది.