సీట్లు పెంచాలని రెండు రాష్ట్రాలు అడిగాయి
⇒ ఏపీఆర్‌ఏ ప్రకారం పెంచడం సాధ్యం కాదు: కేంద్ర హోం శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టం-2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అసెంబ్లీ సీట్లను పెంచాలని కోరాయని కేంద్ర హోం శాఖ తెలిపింది. మంగళవారం ఈమేరకు టీఆర్‌ఎస్ ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, కొత్త ప్రభాకర్ రెడ్డి అడిగిన రాతపూర్వక ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ లోక్‌సభలో సమాధానం ఇచ్చారు. ‘తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అసెంబ్లీ సీట్లు పెంచాలని అడిగాయా, అయితే వివరా లేంటి? కేంద్ర స్పందన ఏంటి?’ అని సభ్యు లు కోరిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ ‘ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సీట్లు పెంచాలని అడిగాయి. ఈ అంశాన్ని కేంద్ర న్యాయ శాఖ దృష్టికి తీసుకెళ్లాం.
న్యాయ శాఖ కేంద్ర అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం 2026 తర్వాత తొలి జనగణనను ప్రచురించే వరకు రెండు రాష్ట్రాల్లోని అసెంబ్లీ సీట్ల సంఖ్యను సర్దుబాటు చేయడం కుదరదని అటార్నీ జనరల్ అభిప్రాయపడ్డారు. అందువల్ల ఆర్టికల్ 170ని సవరించనంత వరకు.. విభజన చట్టంలోని సెక్షన్ 26ను అనుసరించి అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచడం సాధ్యం కాదు’ అని పేర్కొన్నారు.