మాది పొరపాటే!
బద్గామ్ కాల్పుల ఘటనకు బాధ్యత స్వీకరించిన సైన్యం
ఆ ఘటన జరిగి ఉండాల్సింది కాదు.. విచారణకు సహకరిస్తాం
మృతులకు రూ. 10 లక్షలు, క్షతగాత్రులకు రూ. 5 లక్షల పరిహారం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని బద్గామ్ జిల్లా ఛత్తర్‌గామ్‌లో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనలో సైనానిది పొరపాటేనని, దానికి తాము బాధ్యత వహిస్తున్నామని సైన్యం స్పష్టం చేసింది. ఆ ఘటన జరిగి ఉండాల్సింది కాదని.. దీనికి సంబంధించిన ఎలాంటి విచారణకైనా సహకరిస్తామని ఆర్మీ ఉత్తర కమాండ్ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా చెప్పారు. జమ్మూకాశ్మీర్‌లోని బద్గామ్ జిల్లా ఛత్తర్‌గామ్‌లో గత సోమవారం సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు యువకులు మృతిచెందడంతోపాటు మరో ఇద్దరు గాయపడిన విషయం తెలిసిందే. జరిగిన ఘటనకు సంబంధించి తాము బాధ్యత వహిస్తున్నామని హుడా శుక్రవారం చెప్పారు. ఘటనలో మృతులకు రూ. రూ. 10 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని రక్షణశాఖ నిర్ణయించిందన్నా రు. గాయపడినవారికి పునరావాసం కల్పించే బాధ్యతనుసైన్యమే చేపడుతుందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు చేపడతామని.. దీనిపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని హుడా తెలిపారు.
బతికున్నానంటే ఆశ్చర్యమే..!
‘‘సైనికుల కాల్పుల నుంచి నేను బతికి బయటపడ్డానంటే ఆశ్చర్యమే.. అంతా అల్లా దయ’.. బద్గామ్ ఘటనలో సురక్షితంగా బయటపడిన బాసిమ్ అమిన్ అనే 14 ఏళ్ల బాలుడు ఉద్వేగంగా చెప్పిన మాట ఇది. ఈ ఘటనకు సంబంధించి ఆర్మీ చెప్పినవన్నీ అవాస్తవాలంటూ... ఆ రోజు ఘటన వివరాలను అమీన్ వెల్లడించాడు ‘‘మొహర్రం వేడుకల్లో పాల్గొనేందుకు మేం నవ్‌గామ్ నుంచి సూత్‌సూకు ఐదుగురం కారులో బయలుదేరాం. మధ్యలో ఆర్మీ చెక్‌పోస్టుల్లో ఎక్కడా మమ్మల్ని ఆపలేదు. ఫైసల్ కారు నడుపుతున్నాడు. మేమంతా ఉల్లాసంగా ఉన్న సమయంలో.. ఒక ట్రక్కు కారును ఢీకొట్టింది. దీంతో కారును పక్కకు ఆపుతానని ఫైసల్ చెప్పాడు. ఇంతలోనే ఒక సైనికుడు ఫైసల్ భుజంపై తుపాకీతో కాల్చాడు. కారు అదుపుతప్పి వెళ్లి ఒక విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. వెంటనే సైనికులు ఒక్కసారిగా మూడు వైపుల నుంచి కాల్పులు ప్రారంభించారు. మరోవైపున్న కిటికీ నుంచి నేను బయటికి దూకేశాను. ఒక నిమిషం తర్వాత వారు కాల్పులు ఆపారు. అప్పటికే ఫైసల్ రక్తపు మడుగులో కదలకుండా పడి ఉన్నాడు. మెహ్రాజ్, షకీర్, జహీద్ ఒకరిపై ఒకరు పడిపోయి ఉన్నారు. వారి శరీరాల నిండా రక్తం. చాలా భయమేసింది. ప్రాణాలు కాపాడుకోవడానికి వెంటనే పరుగందుకున్నాను. సైనికులు నావైపు కూడా తుపాకులు గురిపెట్టారు..’’ అని అమీన్ చెప్పాడు.