న్యూఢిల్లీ: భారత, చైనా సరిహద్దుల్లో నెలరోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన తొలగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి నేడు రెండు దేశాల సైనికాధికారుల భేటీ మరోసారి జరగనుండగా తూర్పు లదాఖ్‌లో మోహరించిన బలగాల ఉపసంహరణ మొదలైనట్లు సమాచారం. ‘పాంగోంగ్ త్సో ప్రాంతంలోని ఫింగర్స్ రీజియన్, దౌలత్ బేగ్ ఓల్డీ మినహా మిగతా చోట్ల చైనా బలగాలు 2 నుంచి 3 మూడు కిలోమీటర్ల మేర వెనక్కి జరిగాయి. తాత్కాలిక నిర్మాణాల నుంచి పెద్ద సంఖ్యలో సైనికులు తిరోగమించారు. కానీ, ఎంతమంది అనే విషయం స్పష్టం కాలేదు’అని ఆ వర్గాలు తెలిపాయి. ఈ వారంలోనే గాల్వన్ ఏరియాలోని పెట్రోలింగ్ పాయింట్–14, 15, హాట్‌స్ప్రింగ్స్ ఏరియాల్లో రెండు దేశాల అధికారులు చర్చలు జరపనున్నారు. తూర్పు లదాఖ్‌లోని హాట్‌స్ప్రింగ్స్ ప్రాంతంలో రెండు దేశాల సైనికాధికారులు బుధవారం సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాల్లోని సైనిక బలగాలను చైనా వెనక్కి తీసుకుంది. దీనికి సానుకూలంగా స్పందించిన భారత్ కొన్ని బలగాలను, సైనిక వాహనాలను వాపసు తీసుకుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
లదాఖ్‌ను చైనా ఆక్రమించిందా?
లదాఖ్‌లోని భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందా అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ను ప్రశ్నించారు. మంగళవారం ట్విట్టర్‌లో ‘మా పార్టీ హస్తం గుర్తుపై రాజ్‌నాథ్ ఎద్దేవా చేశారు. కానీ, లదాఖ్‌లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందో లేదో చెప్పగలరా?’అని రాహుల్ ప్రశ్నించారు. వేరే పార్టీ గుర్తుని విమర్శించడం, దేశాన్ని రక్షించడం ఒక్కటి కాదని వ్యాఖ్యానించారు. ‘చేతికి బాధయితే ఔషధం తీసుకుంటాం, అదే చెయ్యే బాధయితే ఏం చేస్తాం..అంటూ ప్రముఖ ఉర్దూ కవి మిర్జా గాలీబ్ కవితను ఉటంకిస్తూ కాంగ్రెస్(హస్తం గర్తు)ను రాజ్‌నాథ్ సోమవారం ఎద్దేవా చేయడంపై ఆయన పైవిధంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment