Military Camp
-
సైనిక శిబిరంలో పనిచేస్తున్న కార్మికుడు అదృశ్యం
ఇంఫాల్: మణిపూర్‌లోని ఆర్మీ క్యాంప్‌లో పనిచేస్తున్న మెయిటీ కమ్యూనిటీకి చెందిన 55 ఏళ్ల వ్యక్తి అదృశ్యమయ్యాడు. లోయిటాంగ్ ఖునౌ గ్రామానికి చెందిన లైష్రామ్ కమల్‌బాబు సింగ్.. లిమాఖోంగ్ ఆర్మీ క్యాంపులో పని కోసం ఇంటి నుండి వెళ్లి, ఆ తరువాత నుంచి కనిపించకుండా పోయాడని అధికారులు తెలిపారు. అతని మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసివుందన్నారు. పోలీసులు, సైన్యం సంయుక్తంగా లైష్రామ్ కమల్‌బాబు సింగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.లైష్రామ్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అతను లిమాఖోంగ్ సైనిక శిబిరంలో కూలి పనులు చేసేవాడు. రాజధాని మణిపూర్‌కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న 57 మౌంటైన్ డివిజన్లోని సైనిక శిబిరంలోని ఈ ప్రాంతంలో కుకీ జనాభా అధికంగా ఉంటుంది. జాతి హింస ప్రారంభమైనప్పటి నుండి లిమాఖోంగ్ సమీపంలో నివసిస్తున్న మెయిటీ కమ్యూనిటీ ప్రజలు ఈ ప్రాంతం నుండి వెళ్లిపోయారు. గత ఏడాది మే నుంచి ఇప్పటి వరకు జరిగిన హింసలో 250 మందికి పైగా జనం మృతిచెందారు.జిరిబామ్ జిల్లాలో ఇటీవల జరిగిన ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారుల హత్యకేసులో ప్రమేయం ఉన్న నేరస్తులను పట్టుకునేందుకు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సీఎం బీరెన్‌సింగ్ తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయనప్పటికీ, పలువురిని గుర్తించామన్నారు. గత నవంబర్ 11న భద్రతా బలగాలు- అనుమానిత కుకీ-జో తీవ్రవాదుల మధ్య కాల్పులు జరిగిన తర్వాత జిరిబామ్ జిల్లాలోని సహాయ శిబిరం నుండి మెయిటీ కమ్యూనిటీకి చెందిన ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలు అదృశ్యమయ్యారు. ఈ ఎన్కౌంటర్లో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.ఇది కూడా చదవండి: ప్రియురాలిని హత్య చేసి.. రాత్రంతా మృతదేహంతోనే గడిపి.. -
వీరులకు నివాళి
సాక్షి, చైన్నె: పంజాబ్ సైనిక శిబిరంలో జరిగిన కాల్పుల్లో మృతిచెందిన తమిళవీరులకు నివాళులర్పించారు. వీరి ఇద్దరి మృతదేహాలకు శుక్రవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. పంజాబ్‌లోని సైనిక శిబిరంలో బుధవారం జరిగిన కాల్పుల్లో తమిళనాడులోని తేని జిల్లా దేవారం సమీపంలోని మూనాండి పట్టికి చెందిన యోగేశ్‌కుమార్, సేలం జిల్లా వానంకాడకు చెందిన కమలేష్ మరణించిన విషయం తెలిసిందే. ఈ సమాచారంతో ఆ కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగాయి. వీరి మృతదేహాల కోసం కుటుంబీకులు, ఆ గ్రామస్తులు ఎదురు చూశారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి ఆర్మీ వర్గాలతో మదురై విమానాశ్రయానికి యోగేశ్‌కుమార్ మృతదేహాన్ని తీసుకొచ్చారు. విమానాశ్రయంలో అధికారుల నివాళుల అనంతరం భౌతికకాయాన్ని రోడ్డు మార్గంలో తేనికి తరలించారు. స్వగ్రామంలో ఉంచారు. బంధువులు, ఆప్తుల సందర్శనానంతరం స్థానిక శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. వివాదం.. కమలేష్ భౌతికకాయం తరలింపు వివాదానికి దారి తీసింది. కోయంబత్తూరు విమానాశ్రయం నుంచి ప్రభుత్వ మార్చురీ అంబులెన్స్‌లో తరలించారు. అంబులెన్స్ వెంట ఏ ఒక్క ఆర్మీ అధికారి లేకపోవడంతో గ్రామస్తులలో ఆగ్రహం బయలు దేరింది. దీంతో మృతదేహాన్ని అంబులెన్స్‌లోనే ఉంచి ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత తప్పలేదు. చివరకు పోలీసులు అధికారులు బుజ్జగించారు. ఆర్మీ వర్గాల అంబులెన్స్ వచ్చినానంతరం భౌతికకాయాన్ని స్వస్థలానికి తరలించారు. సాయంత్రం కమలేష్ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిగాయి. కమలేష్ తండ్రి రవి డీఎంకే నాయకుడి కావడం వల్లే ఆయన కుమారుడికి ఆర్మీ వర్గాలు సరైన గౌరవం ఇవ్వలేదని ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మిలిటరీ స్టేషన్లో బుల్లెట్ గాయంతో సైనికుడి మృతి
చండీగఢ్: పంజాబ్‌లోని బటిండా సైనిక స్థావరంలో బుధవారం తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. తాజాగా అదే ప్రాంతంలో ఓ ఆర్మీ సైనికుడు తుపాకీ కాల్పులతో మరణించాడు. కాల్పుల ఘటనలో ఫిరంగి విభాగానికి చెందిన నలుగురు సిబ్బంది మరణించిన 12 గంటల తర్వాత.. బుధవారం మధ్యాహ్నం ఈ జవాను మృతి చెందాడు. ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ.. "భటిండా మిలిటరీ స్టేషన్లో ఏప్రిల్ 12న సాయంత్రం 4:30 గంటలకు ఒక సైనికుడికి తుపాకీ గాయమైంది. అతను తన సేవా ఆయుధంతో సెంట్రీ డ్యూటీలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సైనికుడిని వెంటనే మిలిటరీ ఆసుపత్రికి తరలించామని, అయితే అతను చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. అయితే, తాజా ఘటనకు అంతకుముందు జరిగిన కాల్పులతో ఎలాంటి సంబంధం లేదని అధికారలు పేర్కొన్నారు. ఈ జవాను ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ఏదైనా ప్రమాదం జరిగిందా..? అన్నదానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో మరణించినట్లు ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, తాజా ఘటనతో 24 గంటల వ్యవధిలోనే బఠిండా సైనిక స్థావరంలో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. -
ప్రతిష్టంభనకు ఇక తెర!
న్యూఢిల్లీ: భారత, చైనా సరిహద్దుల్లో నెలరోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన తొలగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి నేడు రెండు దేశాల సైనికాధికారుల భేటీ మరోసారి జరగనుండగా తూర్పు లదాఖ్‌లో మోహరించిన బలగాల ఉపసంహరణ మొదలైనట్లు సమాచారం. ‘పాంగోంగ్ త్సో ప్రాంతంలోని ఫింగర్స్ రీజియన్, దౌలత్ బేగ్ ఓల్డీ మినహా మిగతా చోట్ల చైనా బలగాలు 2 నుంచి 3 మూడు కిలోమీటర్ల మేర వెనక్కి జరిగాయి. తాత్కాలిక నిర్మాణాల నుంచి పెద్ద సంఖ్యలో సైనికులు తిరోగమించారు. కానీ, ఎంతమంది అనే విషయం స్పష్టం కాలేదు’అని ఆ వర్గాలు తెలిపాయి. ఈ వారంలోనే గాల్వన్ ఏరియాలోని పెట్రోలింగ్ పాయింట్–14, 15, హాట్‌స్ప్రింగ్స్ ఏరియాల్లో రెండు దేశాల అధికారులు చర్చలు జరపనున్నారు. తూర్పు లదాఖ్‌లోని హాట్‌స్ప్రింగ్స్ ప్రాంతంలో రెండు దేశాల సైనికాధికారులు బుధవారం సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాల్లోని సైనిక బలగాలను చైనా వెనక్కి తీసుకుంది. దీనికి సానుకూలంగా స్పందించిన భారత్ కొన్ని బలగాలను, సైనిక వాహనాలను వాపసు తీసుకుందని అధికార వర్గాలు వెల్లడించాయి. లదాఖ్‌ను చైనా ఆక్రమించిందా? లదాఖ్‌లోని భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందా అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ను ప్రశ్నించారు. మంగళవారం ట్విట్టర్లో ‘మా పార్టీ హస్తం గుర్తుపై రాజ్‌నాథ్ ఎద్దేవా చేశారు. కానీ, లదాఖ్‌లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందో లేదో చెప్పగలరా?’అని రాహుల్ ప్రశ్నించారు. వేరే పార్టీ గుర్తుని విమర్శించడం, దేశాన్ని రక్షించడం ఒక్కటి కాదని వ్యాఖ్యానించారు. ‘చేతికి బాధయితే ఔషధం తీసుకుంటాం, అదే చెయ్యే బాధయితే ఏం చేస్తాం..అంటూ ప్రముఖ ఉర్దూ కవి మిర్జా గాలీబ్ కవితను ఉటంకిస్తూ కాంగ్రెస్(హస్తం గర్తు)ను రాజ్‌నాథ్ సోమవారం ఎద్దేవా చేయడంపై ఆయన పైవిధంగా స్పందించారు. -
ఇరాన్ ప్రతీకారం
ఇరాన్ సైనిక జనరల్ కాసిం సులేమానిని ద్రోన్ దాడిలో హతమార్చడం ద్వారా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పెట్టిన చిచ్చు ఇరాన్ ప్రతీకార దాడితో కొత్త మలుపు తిరిగింది. బుధవారం వేకువజామున ఇరాక్‌లోని అమెరికాకు చెందిన రెండు సైనిక స్థావరాలపై ఇరాన్ డజనుకుపైగా క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో స్వల్ప నష్టం మాత్రమే జరిగిందని ట్రంప్ ప్రకటించగా, తాము 80మంది ‘అమెరికా ఉగ్రవాదులను’ హతమార్చామని అంతక్రితం ఇరాన్ తెలిపింది. చానెళ్లలో చూస్తే నష్టం ఎక్కువగానే కలిగివుండొచ్చన్న అభిప్రాయం కలుగుతుంది. అధి కారంలోకొచ్చింది మొదలు ట్రంప్ ఇరాన్‌పై కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఆ దేశంపై ఒబామా హయాంలో కుదిరిన అణు ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆయన ప్రయత్నించినప్పుడు అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం సీఐఏ అందుకు అభ్యంతరం తెలిపింది. అణు ఒప్పందంలోని ఏ అంశాన్నీ ఇరాన్ ఉల్లంఘించలేదని అది నివేదిక ఇచ్చింది. అటు తర్వాత 2018 మే లో ఆ ఒప్పందంనుంచి ఏకపక్షంగా బయటకు రావడంతోపాటు కొత్త ఒప్పందానికి సిద్ధపడకపోతే ఆంక్షలు అమలు చేస్తామంటూ హుకుం జారీ చేశారు. దీన్ని ఇరాన్ ఖాతరు చేయకపోవడంతో ఆ ఏడాది డిసెంబర్లో ఆంక్షలు మొదలుపెట్టారు. ఆ దేశం నుంచి ఎవరూ ముడి చమురు కొనరాదని ప్రపంచ దేశాలకు ఆదేశాలిచ్చారు. తర్వాత చర్యగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) దళాలను ఉగ్రవాద బృందంగా పరిగణిస్తున్నట్టు ప్రకటించారు. దాని ప్రకారం సులేమాని అమెరికా దృష్టిలో ‘ఉగ్రవాది’ అయ్యారు. హఠాత్తుగా ఆయనపై ద్రోన్ దాడికి దిగి సంక్షోభానికి అంకురార్పణ చేశారు. ఇరాన్ లక్ష్యంగా చేసుకున్న అమెరికా స్థావరాలు రెండూ వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనవి. ముఖ్యంగా అల్ అసాద్ స్థావరానికి 2018 డిసెంబర్లో ట్రంప్ వెళ్లారు. ఇది అమెరికాకు అత్యంత ప్రధాన మైనదని ఆ సందర్భంగా ఆయన చెప్పారంటే దాని ప్రాముఖ్యత తెలుస్తుంది. అమెరికా యుద్ధ విమానాలతోపాటు హెలికాప్టర్లు, ద్రోన్లు అక్కడ నిరంతరం సిద్ధంగావుంటాయి. తమ సైనిక జన రల్ సులేమానిని హతమార్చిన ద్రోన్ ఇక్కడినుంచే బయల్దేరివుంటుందన్న అనుమానం ఉండ టంవల్లే ఇరాన్ ఈ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుందంటున్నారు. రెండో స్థావరం ఎర్బిల్ ఇరాక్‌లో కుర్దుల ప్రాబల్యంవున్న ప్రాంతంలో వుంది. ఐఎస్ ఉగ్రవాదులపై బాంబుల వర్షం కురిపించడంలో ఈ రెండు స్థావరాలు ప్రధాన పాత్ర పోషించాయి. సులేమాని ఉగ్రవాదని చెబుతున్న అమెరికాకు ఆయన నాయకత్వంలోని కుద్స్ ఫోర్స్ వల్లే ఉగ్ర వాద సంస్థలు అల్–కాయిదా, ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)లు తుడిచిపెట్టుకుపోయాయని తెలియంది కాదు. కానీ పశ్చిమాసియాలో తన మిత్ర దేశాలైన ఇజ్రాయెల్, సౌదీ అరేబియాల ప్రయోజనాలను పరిరక్షించడానికి, ప్రస్తుతం తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ నుంచి ప్రజల దృష్టి మళ్లించ డానికి ట్రంప్ ఈ వృధా ఘర్షణను నెత్తికెత్తుకున్నారు. అపారమైన చమురు నిల్వలతోపాటు తమ భూభాగంలో ముస్లింలు అత్యంత పవిత్రమని భావించే మక్కా, మదీనాలున్నాయి కనుక ముస్లిం ప్రపంచానికి తానే తిరుగులేని సారథినని సౌదీ భావిస్తుంటుంది. 1979లో ఇరాన్ షా మహ్మద్ రేజా పెహ్లవీని కూలదోసిన ఇస్లామిక్ విప్లవం దీన్నంతటిని మార్చింది. అంతవరకూ సౌదీ అరేబియా తోడ్పాటుతో పశ్చిమాసియాపై పెత్తనం చేస్తున్న అమెరికా ఆధిపత్యాన్ని ఆ విప్లవం దెబ్బతీసింది. దాంతోపాటు సౌదీ నాయకత్వానికి కూడా సవాలు విసిరింది. ఇరాన్ షియాల ఆధిపత్యంలో ఉండ టం, సౌదీ సున్నీల ప్రాబల్యంలో ఉండటం ఈ విభేదాలను పెంచింది. 2003లో అమెరికా దురా క్రమణ, సద్దాం హుస్సేన్ పతనం అనంతరం ఇరాక్‌లో మెజారిటీగావున్న షియాలకు బ్యాలెట్ ద్వారా అధికారం చిక్కింది. మరోపక్క సిరియాలో సున్నీలదే మెజారిటీ అయినా అక్కడ అలేవీ తెగకు చెందిన బషర్ అల్ అసద్ గత 20 ఏళ్లుగా అధికారంలోవున్నారు. ఇరాక్‌లో తమ వర్గంవాడైన సద్దాంను కూలదోసిన అమెరికాకు బుద్ధి చెప్పి, అక్కడ ఆధిపత్యం సంపాదించడంతోపాటు తమ వర్గం మెజారిటీగావున్న సిరియాను కూడా చేజిక్కించుకోవాలని చూసిన ఐఎస్‌ను సులేమాని నాయకత్వంలోని కుద్స్ ఫోర్స్ ధ్వంసం చేయగలిగింది. తమకు సాధ్యంకాని పనిని సులేమాని సునాయాసంగా చేసినప్పటినుంచీ అమెరికాకు ఆయనపైనా, ఇరాన్‌పైనా శంక పట్టుకుంది. భవి ష్యత్తులో ఈ ప్రాంతంపై ఇరాన్ పట్టుపెంచుకుంటే ఇజ్రాయెల్, సౌదీలకు పెను నష్టం వాటిల్లుతుం దని భావించబట్టే ఏదో వంకన ఇరాన్‌ను ఊపిరాడనీయకుండాచేసి చక్ర బంధంలో బిగించాలని ట్రంప్ భావిస్తున్నారు. పనిలో పనిగా తనపై వచ్చిన అభిశంసనపై అమెరికన్ ప్రజల దృష్టి పడకుండా ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో తన విజయానికి తోడ్పడుతుందని ఆయన అంచనా వేసుకున్నారు. ప్రతీకార దాడుల ద్వారా అమెరికాను ఇరాన్ రెచ్చగొట్టిందని, దాన్ని యుద్ధం చేయక తప్పని స్థితికి నెట్టిందని కొందరు చేస్తున్న వాదన సరికాదు. తనకు ఇష్టమున్నా లేకున్నా ఆ దేశం 80వ దశకం నుంచి ఘర్షణలమధ్యే మనుగడ సాగిస్తోంది. దాని పర్యవసానాలు అనుభవిస్తూనేవుంది. తనంత తాను కయ్యానికి కాలుదువ్విన చరిత్ర మాత్రం ఇరాన్‌కు లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెత్తనం చేజారుతోందని గ్రహించిన అమెరికా ప్రపంచంపై ఏదో రకమైన సంక్షోభం రుద్దడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఈ క్రమంలో మన దేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవ స్థలు తలకిందులవుతాయి. పశ్చిమాసియాలో యుద్ధం బయల్దేరితే ఆ ప్రాంతంనుంచి చమురు సరఫరా నిలిచిపోతుంది. అలాగే ఇరాన్, సౌదీ అరేబియాతోసహా పలు దేశాలతో మనకున్న వాణిజ్యం ఆగిపోతుంది. ట్రంప్ తాజా ప్రకటన గమనిస్తే వెంటనే యుద్ధం వచ్చే అవకాశాలు లేవన్న అభిప్రాయం కలుగుతుంది. అయితే ఉద్రిక్తతలు మాత్రం ఇప్పట్లో సమసిపోయే అవకాశం లేదు. ఈ దశలోనైనా ఆ ప్రాంతంలో ప్రశాంత పరిస్థితులు నెలకొనేలా ప్రపంచ దేశాలన్నీ చిత్త శుద్ధితో కృషి చేయాలి. -
ఉగ్రదాడిలో 35మంది జవాన్ల మృతి
బమాకో (మాలి) : వైశాల్యపరంగా ఆఫ్రికాలో ఎనిమిదో అతిపెద్ద దేశంగా పిలవబడుతున్న మాలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు మరోసారి దాడులకు తెగబడ్డారు. మాలిలోని మేనక ఔట్‌పోస్టు ప్రాంతంలో ఉన్న సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో సుమారుగా 35 మంది సైనికులు మృతి చెందారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అదుపులో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతంలో జరిగిన ఉగ్రదాడుల్లో కూడా అనేక మంది సైనికులు మరణించారు. ఇటీవలే ఓ నెల రోజుల క్రితం బుర్కినో ఫాసోలో ఇద్దరు జిహాదీలు చేసిన దాడిలో సుమారు 40 మంది సైనికులు మృతిచెందారు. అయితే శుక్రవారం జరిగిన దాడికి సంబంధించి ఇప్పటి వరకు ఏ సంస్థ బాధ్యత ప్రకటించలేదు. ఉత్తర మాలి ప్రాంతంలో ఆల్ ఖైదా ఉగ్రవాదులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అయితే ఫ్రెంచ్ దళాలు చేపట్టిన ఆపరేషన్‌తో ఉగ్రవాదులు ప్రతిదాడులకు దిగుతున్నారు. 2016లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 17మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, 2018లో 40మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 2015లో మాలి రాజధాని బమాకో నగరం మధ్య ఉన్న రాడిసన్ బ్లూ హోటల్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు 18మందిని బలి తీసుకున్న విషయం తెలిసిందే. -
సిరియా మిలటరీలో శిక్షణ తీసుకోనున్న హీరో
‘దేశీ ర్యాంబో’ టైగర్ ష్రాఫ్ మరోసారి తన యాక్షన్ విశ్వరూపం చూపించడానికి రెడి అయ్యాడు. బాగీ మొదటి రెండు సీక్వెల్స్‌లో యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీసి, సీనియర్ యాక్షన్ హీరోలు అక్షయ్, జాన్ అబ్రహాం ప్రశంసలు పొందిన ఈ దేశీ ర్యాంబో ప్రస్తుతం ‘బాగీ 3’ కోసం రెడి అవుతున్నట్లు సమాచారం. ‘బాగీ’ చిత్ర నిర్మాత సజీద్ నదియవాలా ‘బాగీ 3’ని కూడా నిర్మిస్తానని ‘బాగీ 2’ విడుదల సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ ప్రారంభించనున్నారు. ‘బాగీ 3’లో యాక్షన్ సన్నివేశాలు గత రెండు చిత్రాలను మించేలా ఉంటాయంటున్నారు చిత్ర దర్శకుడు అహ్మద్. ఈ యాక్షన్ సన్నివేశాల కోసం టైగర్ ష్రాఫ్ ఏకంగా సిరియా మిలటరీ క్యాంప్‌లో శిక్షణ తీసుకోనున్నట్లు సమాచారం. ‘బాగీ 3’లో యాక్షన్ సన్నివేశాల్లో అధునాతన ‘ఎమ్16’, ‘ఏటీ4’, రాకెట్ లాంచర్ వంటి ఆయుధాలను వినియోగించనున్నట్లు తెలుస్తోంది. శిక్షణ తీసుకోవడం కోసం ఈ ఏడాది నవంబర్‌లో టైగర్ ష్రాఫ్ సిరియా మిలటరి క్యాంప్‌కు వెళ్లనున్నాడని చిత్ర దర్శకుడు అహ్మద్‌ఖాన్ ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. సినిమా కోసం ఎంతైనా కష్టపడే మనస్తత్వం ఉన్న టైగ్ర్ ష్రఫ్ ‘బాగీ’, ‘బాగీ 2’ చిత్రాలలోని యాక్షన్ సన్నివేశాల కోసం మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన సంగతి తెలిసిందే. -
సీషెల్స్‌లో ఆర్మీ కేంద్రం ఏర్పాటుపై కదలిక
విక్టోరియా: పసిఫిక్ మహాసముద్రంలోని సీషెల్స్ దీవిలో మిలటరీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న భారత్ ప్రతిపాదన పట్ల అక్కడి రాజకీయ నాయకులు సానుకూలంగా స్పందించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2015లో సీషెల్స్‌లో పర్యటించిన సమయంలో ఈ ప్రతిపాదన చేశారు. కేంద్రానికి నిధులు భారత ప్రభుత్వమే సమకూరుస్తుందని.. రెండు దేశాలు వినియోగించుకోవచ్చని ప్రతిపాదించారు. తీరప్రాంత రక్షణ, అక్రమంగా చేపలు పట్టడం, మత్తుపదార్థాల రవాణా, పైరసీ వంటి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొవటంలో ఈ కేంద్రం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. -
డోక్లాం : చైనా కొత్త కుట్ర
-
డోక్లాం : చైనా కొత్త కుట్ర
న్యూఢిల్లీ : భారత్‌ను దొంగ దెబ్బ కొట్టేందుకు చైనా రెడీ అవుతోంది. డోక్లాం వివాదంతో అంతర్జాతీయ స్థాయిలో అవమాన పడ్డ చైనా.. వివాదాస్పద ప్రాంతంలోనే గుట్టుచప్పుడు కాకుండా సైనిక స్థావరాన్ని నిర్మించింది. అత్యంత పకడ్బందీగా నిర్మించిన ఈ సైనిక స్థావరం ఆనవాళ్లను శాటిలైట్లు గుర్తించాయి. భూటాన్ భూభాగంలోని డోక్లాం ప్రాంతం తమదే అంటూ చైనా కొంతకాలంగా వాదిస్తోంది. తాజాగా డోక్లాం వివాదాస్పద ప్రాంతానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే సైనిక స్థావరంతోపాట, రహదారులను, హెలీపాడ్, కందకాలను, గన్ పాయింట్లను చైనా నిర్మించింది. ఈ రహదారిలో పదుల సంఖ్యలో ప్రయాణిస్తున్న ఆయుధ వాహనాలను శాటిలైట్ గుర్తించింది. ఇదిలావుండగా వివాదాస్పద భూభాగానికి కేవలం 400 మీటర్ల దూరంలో డ్రాగన్ కంట్రీ.. పలు సొరంగాలను, సైనికులకు బారక్స్‌ని నిర్మించినట్లు శాటిలైట్ ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. సిక్కింలోని డోక్లామ్ పోస్ట్‌కు కేవలం 81 మీటర్ల దూరంలో ఈ మిలటరీ కాంప్లెక్స్ ఉండడం గమనార్హం. -
బాసూ... రజనీ ఇక్కడ!
మిలటరీ క్యాంప్‌లో గన్ షూటింగ్స్ జరుగుతాయి కానీ, సినిమా షూటింగ్స్ జరుగుతాయా? జరుగుతాయి బాసూ.. రజనీకాంత్ ఇక్కడ. ఆయన సినిమాకి పర్మిషన్ అడిగితే ఇవ్వకుండా ఉంటారా? ‘2.0’ కోసం చెన్నైలోని మిలటరీ క్యాంప్ ప్రతినిధులను చిత్రబృందం పర్మిషన్ అడగ్గానే, ‘ఓ.. యస్’ అన్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను ఇటీవల చెన్నై మిలటరీ క్యాంపులో చిత్రీకరించారు. ఈ చిత్రంలో హిందీ నటుడు అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తున్నారు. కాగా, హిందీ నటులు సుధాంశు పాండే, ఆదిల్ హుస్సేన్ కీలక పాత్రలు చేస్తున్నారు. రజనీకాంత్, ఈ ఇద్దరూ, కథానాయిక అమీ జాక్సన్ తదితరులు పాల్గొనగా కొన్ని కీలకమైన సీన్స్ తీశారు. కాగా, ఈ నెల 20న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. ఈ ఫస్ట్ లుక్ కోసం సూపర్ స్టార్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.