స్నేహితురాలు ధారాకు తన ప్రేమను తెలుపుతున్న ఠాకేర్ చంద్రేష్ సింగ్
చెన్నై : ప్రేమించడం అంటే అమ్మలా అక్కున చేర్చుకోవడం.. నాన్నలా బాధ్యతగా చూసుకోవడం.. సోదరునిలా తోడుగా నిలవడం.. మిత్రునిగా సుఖసంతోషాలు పంచుకోవడం.. కానీ నేడు చాలా మంది ప్రేమ అనే పేరుకు కనీసం అర్థం కూడా తెలియని వయసులో.. ప్రేమ పేరు చెప్పి వెర్రిమొర్రి వేషాలు వేస్తూ.. బరువు బాధ్యతలను మర్చిపోయి తిరుగుతున్నారు. ప్రేమ పేరుతో అడ్డు అదుపూ లేకుండా తిరగడం.. బాధ్యతలు మీద పడే సమయానికి నమ్ముకున్న వారిని నట్టేటముంచడం.. కొందరు మరో అడుగు ముందుకు వేసి ప్రేమించిన వ్యక్తి తనకు కాకుండా మరేవరికి దక్కకూడదనే ఆవేశంలో పైశాచికంగా ఎదుటి వ్యక్తి ప్రాణాలు కూడా తీయడానికి వెనకడాకపోవడం.. ఇది నేటి కాలం ప్రేమ, ప్రేమికుల పరిస్థితి.
అయితే అందరూ ఇలానే ఉంటారా అంటే ఉండరు. ప్రేమించిన వ్యక్తిని జీవితాంతం సంతోషంగా ఉంచాలి అనుకునే వారు ముందు అందుకు తగిన విధంగా తమ జీవితాన్ని మార్చుకుంటారు.. మలచుకుంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తే చంద్రేష్ సింగ్. ప్రేమించిన స్నేహితురాలిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ దానికంటే ముందు జీవితంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. అందుకుగాను దాదాపు మూడేళ్లపాటు శ్రమించి కోరుకున్న చెలిని మాత్రమే కాక మనసుకు నచ్చిన ఉద్యగాన్ని కూడా సాధించి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
వివారాలు.. ఠాకూర్ చంద్రేష్ సింగ్(25) డిగ్రీ చదవడం కోసం 2012లో బెంగళూరులోని సెయింట్ జోసఫ్ కాలేజ్‌లో చేరాడు. అక్కడ అతనికి ధారా పరిచయమయ్యింది. ఈ క్రమంలో చంద్రేష్, ధారాను ప్రేమించాడు. తన మనసులోని మాటను ధారాకు చెప్పడానికి కంటే ముందు మరో ముఖ్యమైన బాధ్యత అతనికి గుర్తుకు వచ్చింది. ‘ప్రేమించడం తేలికే. కానీ ఆ ప్రేమను జీవితాంతం నిలబెట్టుకోవాలన్నా.. ధారా తల్లిదండ్రులు నా ప్రేమను అంగీకరించాలన్నా ముందు నేను జీవితంలో స్థిరపడాలి. నన్ను నేను నిరూపించుకోవాలి. అందుకోసం నాకిష్టమైన ఆర్మీలో చేరతాను. ఉద్యోగం సాధించిన తరువాతనే ధారాకు నా మనసులోని మాటను చెప్తాను’ అని నిశ్చయించుకున్నాడు. కానీ చంద్రేష్ ఆర్మీలో చేరడానికి ముందే ధారా గురించి తన కుటుంబ సభ్యులకు చెప్పి వారి అనుమతి పొందాడు.
అనంతరం చెన్నైలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో చేరాడు. దాదాపు మూడున్నరేళ్ల తర్వాత శిక్షణ చివరి రోజున తన తల్లిదండ్రులతో పాటు ధారాను, ఆమె తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాడు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్నందుకు గుర్తుగా చంద్రేష్ తల్లిదండ్రులు అతనికి స్టార్స్ అలంకిరంచారు. అనంతరం వారందరి సమక్షంలో చంద్రేష్, ధారాకు తన ప్రేమను తెలియజేసి ఆమెను వివాహం చేసుకుంటానంటూ కోరాడు. అందుకు ధారా కూడా సంతోషంగా ఒప్పుకుంది. అటూ ఇరుకుటుంబాల పెద్దలు కూడా వీరి ప్రేమను అంగీకరించడమే కాకా త్వరలోనే వివాహం చేస్తామని తెలిపారు.
ఒకే రోజు ఇష్టమైన కొలువును.. మనసుకు నచ్చిన అమ్మాయిని పోందిని చంద్రేష్, ధారాల ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటికే ఈ ఫోటోలను కొన్ని వేల మంది వీక్షించడమే కాక చంద్రేష్ - ధారాలను అభినందనలతో ముంచేత్తుతూ మీ ప్రేమ ఎందరికో ఆదర్శం అంటూ పొగుడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment