ఆవిర్భావం నుంచి రద్దు వరకు.. | Article 370 and India's Jammu and Kashmir over the years | Sakshi
Sakshi News home page

ఆవిర్భావం నుంచి రద్దు వరకు..

Published Tue, Aug 6 2019 3:48 AM | Last Updated on Tue, Aug 6 2019 10:32 AM

Article 370 and India's Jammu and Kashmir over the years - Sakshi

ఆవిర్భావం నుంచి కశ్మీర్‌ సమస్యలకు, వివాదాలకు నిలయంగా మారింది. నాటి నుంచి కశ్మీర్‌ ప్రత్యేక హోదా రద్దు వరకు పరిణామాలు...

► 1846: ఆంగ్లేయులకు సిక్కులకు మధ్య జరిగిన మొదటి యుద్ధం దరిమిలా జమ్మూ పాలకుడు రాజా గులాబ్‌ సింగ్‌కు బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీకి మధ్య కుదిరిన ఒప్పందం (అమృతసర్‌ ఒప్పందం) మేరకు మార్చి 16న జమ్మూకశ్మీర్‌ స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది.

► 1946, మే: మహారాజుకు వ్యతిరేకంగా షేక్‌ అబ్దుల్లా క్విట్‌ కశ్మీర్‌ ఉద్యమాన్ని ప్రారంభించారు. అరెస్టయిన అబ్దుల్లాను కాపాడేందుకు నెహ్రూ విఫలయత్నం చేశారు.

► 1946, జులై: బయటివారి ప్రమేయం అవసరం లేకుండా కశ్మీరీలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకుంటారని రాజా హరిసింగ్‌ ప్రకటించారు.

► 1947, జూన్‌3: భారత దేశాన్ని భారత్, పాకిస్తాన్‌లుగా విభజించాలని మౌంట్‌ బాటెన్‌ ప్రతిపాదించారు

► 1947, జూన్‌19: కశ్మీర్‌ను భారత్‌లోనో లేదా పాకిస్తాన్‌లోనో విలీనం చేసేలా హరిసింగ్‌ను ఒప్పించడం కోసం మౌంట్‌బాటెన్‌ ఐదు రోజులు కశ్మీర్‌లో ఉన్నారు

 

► 1947, జులై: సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ ఆహ్వానం మేరకు రాజా హరిసింగ్‌ ఢిల్లీ వచ్చి గోపాల్‌ దాస్‌తో చర్చలు జరిపారు.

► 1947, జులై 11: కశ్మీర్‌ స్వతంత్రం కోరుకుంటే పాకిస్తాన్‌ దానితో స్నేహం చేస్తుందని మహ్మద్‌ అలీ జిన్నా ప్రకటించారు

► 1947, ఆగస్టు1: మహాత్మాగాంధీ హరిసింగ్‌ను కలిసి ప్రజాభీష్టం మేరకు విలీనంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.

► 1947, సెప్టెంబర్‌22: పాకిస్తాన్‌లో విలీనానికి సానుకూలత తెలుపుతూ ముస్లిం కాన్ఫరెన్స్‌ నిర్ణయం తీసుకుంది.అయితే, భారత్‌లో విలీనం కావాలని మహారాజు నిర్ణయించారని పాకిస్తాన్‌ టైమ్స్‌ పేర్కొంది.

► 1947, అక్టోబర్‌: భారత్‌–పాక్‌ యుద్ధం. పాక్‌ వాయవ్య రాష్ట్రానికి చెందిన వేల మంది గిరిజనులు కశ్మీర్‌పై, రాజ హరిసింగ్‌ సైన్యంపై దాడికి దిగారు. హరిసింగ్‌ భారత్‌ సహాయం కోరారు. దానికి భారత్‌ పెట్టిన షరతుకు హరిసింగ్‌ అంగీకరించారు. ఇరు పక్షాలు విలీన ఒప్పందంపై సంతకం చేశాయి.భారత సైన్యం కశ్మీర్‌ను రక్షించింది. కశ్మీర్‌ విషయమై జరిగిన మొదటి యుద్ధమిది.

► 1948: కశ్మీర్‌ సమస్యను భారత దేశం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ముందుకు తీసుకెళ్లింది.కాల్పుల విరమణ, కశ్మీర్‌ భవిష్యత్తుపై ప్రజాభిప్రాయ సేకరణ వంటి అంశాలతో తీర్మానం కుదిరింది.

► 1949, జనవరి1: భారత్,పాక్‌ మధ్య కాల్పుల విరమణ జరిగింది. కశ్మీర్‌లో కొంత భాగం పాక్‌కు వెళ్లిపోయింది.

► 1949: జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో భాగం చేయాలంటూ కశ్మీర్‌ అసెంబ్లీ ఉద్యమం చేపట్టింది.

► 1949, జూన్‌: మమారాజా హరిసింగ్‌ తన కుమారుడు కరణ్‌ సింగ్‌ను రాజప్రతినిధిగా నియమించి తాను వైదొలిగారు.

► 1949, అక్టోబరు 17: కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగసభ రాజ్యంగంలో 370 అధికరణను చేర్చింది.

► 1951, నవంబర్‌: రాజా హరిసింగ్‌ అధికారాలను రద్దు చేస్తూ, శాసన సభను ప్రభుత్వానికి జవాబుదారీ చేస్తూ రాజ్యాంగ సభ చట్టం చేసింది.

► 1957: జమ్మూకశ్మీర్‌ భారత్‌లో భాగమని, ఈ విషయమై ప్రజాభిప్రాయ సేకరణ జరిపే ప్రసక్తే లేదని భారత హోం మంత్రి గోవింద్‌ వల్లభ్‌ పంత్‌ స్పష్టం చేశారు.

► 1965: కశ్మీర్‌ విషయమై భారత్, పాక్‌ మళ్లీ తలపడ్డాయి.

► 1966, జనవరి 10: రష్యా మధ్యవర్తిత్వంలో ఇరు దేశాలు 1965కు ముందున్న స్థానాలకు వెళ్లిపోవాలంటూ రూపొందించిన తాష్కెంట్‌ ఒప్పందంపై భారత్, పాక్‌లు సంతకాలు చేశాయి.

► 1989: అఫ్గానిస్తాన్‌ నుంచి వేలమంది మిలిటెంట్లు కశ్మీర్‌లోకి ప్రవేశించారు. పాకిస్తాన్‌ వారికి అవసరమైన శిక్షణ, ఆయుధాలు అందజేసింది

► 1989: కశ్మీర్‌ నుంచి పెద్ద సంఖ్యలో హిందువులు (కశ్మీరీ పండిట్లు) ఇతర ప్రాంతాలకు వలసపోసాగారు.

► 1972: భారత్, పాకిస్తాన్‌ల మధ్య సిమ్లా ఒప్పందం కుదిరింది. దీనికి అనుగుణంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్, కశ్మీర్‌ల మధ్య నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) రూపుదిద్దుకుంది.

► 1999: పాకిస్తాన్‌ మద్దతుతో మిలిటెంట్లు కశ్మీర్‌ సరిహద్దు దాటి కార్గిల్‌లో భారత సైనిక స్థావరాలను చట్టుముట్టారు. పది వారాల పాటు జరిగిన యుద్ధంలో భారత బలగాలను దురాక్రమణదారులను తిప్పికొట్టాయి.

► 2013, ఫిబ్రవరి: భారత పార్లమెంటుపై దాడి కేసులో జైషే మహ్మద్‌ నేత అఫ్జల్‌ గురును ప్రభుత్వం ఉరితీసింది.

► 2015, మార్చి: భారతీయ జనతాపార్టీ మొదటి సారి కశ్మీర్‌లో పీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

► 2016: భారత సైనిక స్థావరాలపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిపింది

► 2019: పుల్వామా వద్ద ఉగ్రవాదులు జరిపిన దాడిలో40 మంది భారత సైనికులు అమరులయ్యారు.దానికి ప్రతిగా భారత్‌ పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై మెరుపుదాడులు జరిపింది.

 

► 2019, ఆగస్టు2: ప్రభుత్వం అమర్‌నాథ్‌ యాత్రను రద్దు చేసింది. యాత్రికులు స్వస్థలాలకు వెళ్లిపోవాలని ఆదేశం.

► 2019, ఆగస్టు 3: కశ్మీర్‌లోని పర్యాటకులు, యాత్రికులు, ఇతర రాష్ట్రాల విద్యార్థులను స్వస్థలాలకు తరలించారు.

► 2019, ఆగస్టు 4: మెహబూబా ముఫ్తి, ఒమర్‌ అబ్దుల్లాలను గృహ నిర్బంధం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ తదితన ఉన్నత భద్రతాధికారులతో చర్చలు జరిపారు.

► 2019, ఆగస్టు 5: కశ్మీర్‌కు ప్రత్యేక హోదానిస్తున్న 370 అధికరణను కేంద్రం రద్దు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement