రావణ కాష్టంలా మండుతూనే ఉన్న కశ్మీర్ సమస్యకు...ఆర్టికల్ 370 రద్దు పరిష్కారం అవుతుందా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది కాలమే..! అయితే 1949లో మొదలైన ఈ సమస్యలో కీలక పాత్ర ధారులు ఎవరు?
ఆద్యుడు... రాజా హరిసింగ్!
కశ్మీర్ సమస్యకు మూల పురుషుడు.. జమ్మూ కశ్మీర్ రాజ్యానికి చిట్టచివరి రాజు. 1895 సెప్టెంబరు 23న జమ్మూలోని అమర్ మహల్‌లో జన్మించిన రాజా హరిసింగ్... 1909లో తండ్రి రాజా అమర్ సింగ్ జమ్వాల్ మరణం తరువాత బ్రిటిష్ పాలకుల కనుసన్నల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అజ్మీర్‌లోని మేయో కాలేజీలో చదువు పూర్తయిన తరువాత డెహ్రాడూన్‌లోని ఇంపీరియల్ కేడెట్ కారŠప్స్‌లో మిలటరీ శిక్షణ పొందిన హరిసింగ్‌ను బాబాయి మహారాజా ప్రతాప్ సింగ్ 1915లో జమ్మూ కశ్మీర్ సైనికాధికారిగా నియమించారు. 1925లో గద్దెనెక్కిన రాజా హరిసింగ్.. తన రాజ్యంలో నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేశారు.
బాల్యవివాహాలను రద్దు చేయడమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాల వారికీ పూజా మందిరాలు అందుబాటులో ఉండేలా చట్టాలు చేశారు. రాజకీయంగా తొలి నుంచి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిన హరిసింగ్... మత విద్వేషాలను రెచ్చగొడుతుందని ముస్లింలీగ్, దాని సభ్యులనూ పూర్తిగా వ్యతిరేకించారు. పష్తూన్ల దాడుల్లో కోల్పోయిన రాజ్యాన్ని మళ్లీ దక్కించుకునేందుకు భారత ప్రభుత్వంతో చేతులు కలిపిన హరిసింగ్ తన చివరి రోజులను ముంబైలో గడిపారు. 1961 ఏప్రిల్ 26న హరిసింగ్ మరణించగా వీలునామా ప్రకారం.. ఆయన అస్థికలను జమ్మూ ప్రాంతం మొత్తం చల్లడంతోపాటు తావీ నదిలో నిమజ్జనం చేశారు.
తొలి నేత... షేక్ అబ్దుల్లా...
కశ్మీరీల సమస్యలన్నింటికీ భూస్వామ్య వ్యవస్థ కారణమని నమ్మిన.. ప్రజాస్వామ్య వ్యవస్థతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పిన కశ్మీరీ నేత షేక్ అబ్దుల్లా. జమ్మూ కాశ్మీర్ చివరి రాజు రాజా హరిసింగ్, భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూలకు మిత్రుడిగా మాత్రమే కాకుండా.. ఆ ప్రాంతంలో తొలి రాజకీయ పార్టీని స్థాపించిన వ్యక్తిగానూ షేక్ అబ్దుల్లాకు పేరుంది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో విద్యనభ్యసించిన షేక్ అబ్దుల్లా 1932లో కశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్‌ను స్థాపించారు. తరువాతి కాలంలో ఈ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్‌గా మారింది.
1932 సమయంలోనే జమ్మూ కశ్మీర్‌కు ఒక అసెంబ్లీ ఏర్పాటైనప్పటికీ అధికారం మాత్రం రాజా హరిసింగ్ చేతుల్లోనే ఉండేది. రాజరికం తొలగిపోయిన తరువాత మూడుసార్లు ప్రభుత్వాన్ని నడిపిన అబ్దుల్లాను షేర్ –ఏ– కశ్మీర్‌గా పిలుస్తారు. కశ్మీర్ నుంచి రాజా హరిసింగ్ తొలగాలన్న డిమాండ్‌తో ఉద్యమం నడిపిన చరిత్ర కూడా ఈయనదే. 1953లో రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నాడన్న ఆరోపణలతో అబ్దుల్లాను 11 ఏళ్లపాటు జైల్లో పెట్టారు. ఆ తరువాత 1975లో భారత ప్రధాని ఇందిరాగాంధీతో కుదిరిన ఒప్పందంతో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా తిరిగి రాజకీయాల్లోకి వచ్చారు ఆయన. 1964లో కశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలన్న లక్ష్యంతో పాకిస్తాన్‌కు వెళ్లిన అబ్దుల్లా అప్పటి ప్రధానితో చర్చలు జరిపారు.
తొలి, చివరి ప్రెసిడెంట్... రాజా కరణ్ సింగ్...
దేశంలో రాజభరణాలు, బిరుదులన్నింటినీ రద్దు చేసిన ఇందిరాగాంధీ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి రాజా కరణ్‌సింగ్. 1931 మార్చి తొమ్మిదిన ఫ్రాన్స్‌లోని కెయిన్స్‌లో జన్మించిన కరణ్‌సింగ్.. జమ్మూ కశ్మీర్ చివరి రాజు రాజా హరిసింగ్ ఏకైక సంతానం. కవిగా, దాతగా మాత్రమే కాకుండా.. ప్రచ్ఛన్న యుద్ధ పరిసమాప్తి సమయంలో అమెరికాలో భారత రాయబారిగానూ పనిచేసిన ఘనత ఈయనది. 1949 అక్టోబరులో కశ్మీర్ రాజ్యం భారత ప్రభుత్వంలో విలీనమైన రోజు నుంచి 18 ఏళ్ల వయసులోనే జమ్మూకశ్మీర్ ప్రతినిధిగా నియమితుడైన కరణ్ సింగ్.. తరువాతి కాలంలో రాష్ట్ర తొలి, చివరి అధ్యక్షుడిగా, గవర్నర్‌గానూ వ్యవహరించారు.
ఈ కాలంలోనే జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పిస్తూ భారత రాష్ట్రపతి పేరుతో అనేక ఉత్తర్వులు వెలువడ్డాయి. 1961 నుంచి తనకు అందుబాటులో ఉన్న రాజభరణాన్ని 1973లో స్వయంగా త్యజించిన వ్యక్తిగా కరణ్‌సింగ్‌కు పేరుంది. 1967–73 మధ్యకాలంలో కేంద్ర పర్యాటక, పౌర విమానయాన శాఖల మంత్రిగా పనిచేశారు. 1984 వరకూ పలు దఫాలు లోక్‌సభకు ఎన్నికైన కరణ్‌సింగ్ వైద్య ఆరోగ్యం, విద్య, సాంస్కృతిక శాఖల మంత్రిగా పనిచేశారు. 1971 పాకిస్తాన్ యుద్ధం సమయంలో తూర్పు దేశాలకు భారత ఉద్దేశాలను వివరించే దూతగానూ పనిచేశారు. 1999 వరకూ నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున, ఆ తరువాత 2018 వరకూ కాంగ్రెస్ తరఫున రాజ్యసభ ఎంపీగా కొనసాగారు.
అతివాది... యాసిన్ మాలిక్...
జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అనే వేర్పాటువాద సంస్థ స్థాపకుడు యాసిన్ మాలిక్. భారత్, పాకిస్తాన్ రెండింటి నుంచి కశ్మీర్ వేరుపడాలన్నది ఈయన సిద్ధాంతం. 1966లో శ్రీనగర్‌లో జన్మించిన యాసిన్ తన సిద్ధాంతం కోసం తుపాకులు పట్టాడు కూడా. అయితే 1994 తరువాత ఈయన తీవ్రవాదాన్ని విడిచిపెట్టడమే కాకుండా... శాంతియుత మార్గాల ద్వారా మాత్రమే కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రచారం చేశారు. 1987 అసెంబ్లీ ఎన్నికల్లో ఇస్లామిక్ స్టూడెంట్స్ లీగ్ అధ్యక్షుడిగా యాసిన్ మాలిక్ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్‌కు ప్రచారం చేశారు.
నేషనల్ కాన్ఫరెన్స్ కండబలాన్ని ఎదుర్కొనేందుకు మాలిక్ ఉపయోగపడ్డారని విశ్లేషకులు అంటారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడటమే కశ్మీర్‌లో చొరబాట్ల సమస్యకు కారణమైందన్న విశ్లేషకుల అంచనాలను అంగీకరించని మాలిక్ రిగ్గింగ్ అంతకుమునుపు కూడా ఉందని అంటారు. 2007లో సఫర్ ఏ ఆజాదీ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేసిన యాసిన్ మాలిక్ కశ్మీర్ సమస్య పరిష్కారం పేరుతో తరచూ పాకిస్తాన్ ప్రధానితో సమావేశం కావడం, చర్చలు జరపడం భారతీయుల్లో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. 2013లో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబా అధ్యక్షుడు హఫీజ్ సయీద్‌తో కలిసి యాసిన్ మాలిక్ ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొనడం దేశంలో తీవ్ర చర్చకు దారితీసింది.
స్వతంత్రవాది ఒమర్ ఫారూఖ్...
జమ్మూకశ్మీర్‌పై భిన్నాభిప్రాయం కలిగినవారిలో మిర్వాయిజ్ ఒమర్ ఫారూఖ్ ఒకరు. జమ్మూ కాశ్మీర్ భారత్ నుంచి వేరు పడాలని, స్వతంత్రంగా ఉండాలన్న భావజాలం కలిగిన హురియత్ కాన్ఫరెన్స్ సభ్యత్వమున్న పార్టీల్లో మిర్వాయిజ్ పార్టీ అవామీ యాక్షన్ కమిటీ కూడా ఒకటి. 2003లో హురియత్ కాన్ఫరెన్స్ రెండుగా చీలిపోగా మిర్వాయిజ్ నేతృత్వంలోని వర్గానికి మితవాద వర్గమని పేరు. కశ్మీర్ రాజకీయాల్లోకి రాకమునుపు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలనుకన్న మిర్వాయిజ్ ఆ తరువాతి కాలంలో ఇస్లామిక్ స్టడీస్‌లో స్నాతకోత్తర విద్యతోపాటు పీహెచ్‌డీ కూడా చేశారు. జమ్మూ కశ్మీర్‌లో తొలి రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిన ముస్లిం కాన్ఫరెన్స్ తొలి అధ్యక్షుడు మిర్వాయిజ్ తాత. కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికల్లో తరచూ లేవనెత్తే మిర్వాయిజ్ భారత్, పాకిస్థాన్‌ల మధ్య చర్చల ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం అవుతుం దని నమ్మేవారిలో ఒకరు. అయితే ఇరుపక్షాలు ప్రజల ఆశయాలను కూడా అర్థం చేసుకోవాలని అంటారాయన.
ఉగ్రవాదానికి బీజం... గిలానీ...
కశ్మీర్ సమస్యకు బీజం పడిన సమయం నుంచి జీవించి ఉన్న అతికొద్ది మంది రాజకీయ నేతల్లో సయ్యద్ అలీ షా గిలానీ ఒకరు. 1929 సెప్టెంబరు 29న బండిపొరలో జన్మించిన గిలానీ వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్‌కు అధ్యక్షుడిగా చాలాకాలం పనిచేశారు. కశ్మీర్‌లో ఉగ్రవాదానికి బీజం పడింది గిలానీ విధానాల కారణంగానే అని కొంతమంది నేతలు ఆరోపిస్తారు. హురియత్ కాన్ఫరెన్స్ రెండు భాగాలుగా విడిపోయిన తరువాత తెహ్రీక్ ఏ హురియత్ పేరుతో మరో పార్టీని స్థాపించిన గిలానీ ఉగ్రవాదుల మరణాలకు నిరసనగా తరచూ కశ్మీర్‌లో బంద్‌లు, రాస్తారోకోలకు పిలుపునిచ్చేవారు కశ్మీర్ సమస్యకు స్వాతంత్య్రం ఒక్కటే పరిష్కారమన్న అంశంపై ఒక సదస్సు నిర్వహించినందుకుగాను.. .2010లో భారత ప్రభుత్వం గిలానీతోపాటు రచయిత్రి అరుంధతీ రాయ్, మావోయిస్టు సానుభూతిపరుడు వరవర రావులపై భారత ప్రభుత్వం దేశద్రోహం కేసు నమోదు చేసింది. 2016లో బుర్హాన్ వానీ మరణం తరువాత ఏర్పడ్డ పరిస్థితుల్లో కశ్మీర్‌లో సాధారణ స్థితిని తీసుకొచ్చేందుకని గిలానీ ఐక్యరాజ్య సమితికి లేఖ రాశారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై గిలానీ పాస్‌పోర్టును 1981లోనే రద్దు చేశారు. అయితే 2006లో మూత్రనాళ కేన్సర్ బారిన పడినట్లు నిర్ధారణ కావడంతో చికిత్స కోసం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గిలానీకి మళ్లీ పాస్‌పోర్టు దక్కేలా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment