
న్యూఢిల్లీ : గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి సోమవారం ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ పూర్తిచేశారు. జైట్లీకి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసినట్టు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, త్వరగా కోలుకుంటారని తెలిపారు. ఈ సర్జరీ కోసం జైట్లీ శనివారం రోజు ఎయిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.
నేడు ఉదయం 8 గంటలకు జైట్లీకి వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా సోదరుడు అపోలో ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సందీప్ గులేరియా ఈ ఆపరేషన్ చేశారు. సందీప్ గులేరియా జైట్లీ కుటుంబానికి సన్నిహితుడు కూడా. ఈ అనారోగ్య సమస్యతో జైట్లీ వచ్చే వారంలో లండన్‌లో జరుగబోయే 10వ భారత్-అమెరికా ఎకానమిక్, ఫైనాన్సియల్ సదస్సు పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. జైట్లీకి కొన్నేళ్ల క్రితం గుండె సంబంధిత సర్జరీ కూడా అయింది.