హమ్మయ్య... ఇల్లు దొరికింది!!
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్కు ఎట్టకేలకు ఓ ఇల్లు దొరికింది. అద్దె ఇంటి కోసం ఆయన గత కొన్నాళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్ ఏరియాలో ఆయనకు ఇప్పుడు ఓ ఇల్లు దొరికింది. దీంతో వచ్చే నెల మొదటివారంలోనే ఆయన తన అధికారిక నివాసమైన తిలక్ లేన్ ఇంటిని ఖాళీ చేస్తారని తెలుస్తోంది. నరేన్ జైన్ అనే ఆయన తనకు ఇల్లు ఇచ్చారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలని కేజ్రీవాల్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ భుకు రాం జైన్ కుమారుడే ఈ నరేన్ జైన్. ఈయనకు ఢిల్లీలో అనేక ఆస్తులున్నాయి. వాటిని అద్దెలకు ఇస్తూ ఉంటారు. ఈ ఇంటిని అద్దెకు ఇవ్వాల్సిందిగా తన బ్రోకర్కు చెప్పానని, చివరకు అది కేజ్రీవాల్కే వెళ్లిందని నరేన్ జైన్ తెలిపారు.
ఈ ఇంట్లో నాలుగు బెడ్రూంలు, నాలుగు బాత్రూంలు, ఒక కిచెన్, డైనింగ్ రూం, హాలు ఉన్నాయి. ఇంటిముందు, వెనక భాగాల్లో చిన్న చిన్న తోటలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఇది ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ తండ్రిది. కానీ, ఆయన 1960లలోనే అమ్మేశారు. తర్వాత 2005లో జైన్ దీన్ని కొన్నారు. సాధారణంగా అయితే ఈ ఇంటికి నెలకు 50 వేల నుంచి 60 వేల వరకు అద్దె ఉంటుందని జైన్ చెప్పారు. అయితే, గత తొమ్మిదేళ్లుగా ఇది ఖాళీగా ఉన్నందున చాలా మరమ్మతులు చేయాల్సి ఉందని, వాటికి కనీసం 15 రోజులు పడుతుందని అన్నారు.
I have finally decided upon a house offered by Sh Naren Jain in Civil Lines area. Thanks Naren ji.
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 20, 2014