
మన్ కీ బాత్ చెప్పుకునే అవకాశం ఒక్కరికే
న్యూఢిల్లీ: సమయం దొరికినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విరుచుకుపడే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ట్వీట్లతో దాడి చేశారు. భారతదేంలో భావ ప్రకటనా స్వేచ్ఛ లేదన్న బాలీవుడ్ నటుడు కరణ్ జోహర్ వ్యాఖ్యల్ని అవకాశంగా తీసుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించారు. దేశంలో పెరుగుతున్న అసహనంపై వ్యాఖ్యానించిన దర్శకుడు కరణ్ జోహార్ మద్దతుగా నిలిచిన కేజ్రీవాల్ 'ఈ దేశంలో ఒకే ఒక్క వ్యక్తి బహిరంగంగా మన్ కి బాత్' గురించి మాట్లాడవచ్చంటూ' శనివారం ట్వీట్ చేశారు.
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ సందర్భంగా కరణ్ జోహర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఢిల్లీ సీఎం సమర్ధించారు. మన్ కీ బాత్ ను బయటపెట్టే అవకాశం ఈ దేశంలో ఒక్కరికి మాత్రమే ఉందంటూ సెటైర్లు వేశారు. ఇదే విషయంలో గతంలోనూ బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ కూడా తన మద్దతు తెలిపారు.కాగా బాలీవుడ్లో కభీ ఖుషీ కభీ గమ్ , మై నేమ్ ఈజ్ ఖాన్ కుఛ్ కుఛ్ హోతా హై లాంటి ప్రతిష్టాత్మక సినిమాలను నిర్మించిన కరణ్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి ప్రజాస్వామ్యదేశంలో మాట్లాడడం ఒక జోక్ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.