జబల్పూర్‌లో ఎగ్జామ్‌సెంటర్ వద్ద 12వ తరగతి విద్యార్థినులకు థర్మల్ స్క్రీనింగ్
న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్ మరింత విజృంభిస్తోంది. గత వారం రోజులుగా ప్రతిరోజూ సగటున 10 వేల కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం నాటికి దేశవ్యాప్తంగా 2.6 లక్షల కేసులు నమోదైనట్టుగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొన్ని ఆంక్షల మధ్య మాల్స్, ప్రార్థనా మందిరాలు ప్రారంభించడంతో రాబోయే రోజుల్లో కేసులు మరింత పెరుగుతాయనే ఆందోళనలున్నాయి. దేశంలో కొత్తగా ఒకే రోజు 9,987 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా కేసుల సంఖ్య 2,66,598కి చేరుకుంది. మరోవైపు మృతుల సంఖ్య పెరిగింది. గత కొద్ది రోజులుగా ప్రతిరోజూ సగటున 250 మంది వరకు మరణిస్తున్నారు. ఒకే రోజు మరో 266 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 7,466కి చేరుకుంది. ఈ మధ్య కాలంలో హరియాణా, జమ్మూకశ్మీర్, అస్సాం, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక కేసుల రికవరీ శాతం నిలకడగా కొనసాగుతోంది. 48.47 శాతం రికవరీ రేటుగా ఉన్నట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కేజ్రీవాల్‌కు కరోనా నెగెటివ్
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కరోనా పరీక్షలో నెగెటివ్ వచ్చింది. కేజ్రీవాల్ గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతూ ఆదివారం నుంచి స్వీయ నిర్బంధంలో ఉన్నారు. మంగళవారం ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకలేదని నిర్ధారణ అయిందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఇప్పుడే కేజ్రివాల్‌కు జ్వరం తగ్గుతోందని, ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారని తెలిపారు.
ఢిల్లీలో జూలై 31కి 5.5 లక్షల కేసులు!
ఢిల్లీలో జూలై 31 నాటికి 5.5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని కేంద్రానికి చెందిన అధికారులు అంచనా వేసినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. జూలై ఆఖరినాటికి 80 వేల పడకలు అవసరం పడతాయని∙చెప్పారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డీడీఎంఏ) సమావేశం జరిగింది. ఈ భేటీ తర్వాత సిసోడియా మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో సామూహిక వ్యాప్తి లేదని కేంద్ర ప్రభుత్వ అధికారులు అంచనాకొచ్చినట్టు తెలిపారు. జూన్ 30 నాటికి లక్ష కేసులు నమోదవుతాయని, కేసులు రెట్టింపయ్యే తీరుని చూస్తే జూలై 31 నాటికి 5.5లక్షలకేసులు నమోదయ్యే చాన్సుందన్నారు. రానున్న రోజులలో 12–13 రోజులకు కేసుల డబ్లింగ్ జరిగితే పడకలకు కొరత ఏర్పడుతుందని, ఢిల్లీవాసులకు ఇబ్బందులు కలుగుతాయన్నారు.
జ్యోతిరాదిత్య, మాధవిరాజెలకు పాజిటివ్
బీజేపీ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా, ఆయన తల్లి మాధవి రాజె సింధియాలకు కరోనా వైరస్ సోకింది. దక్షిణ ఢిల్లీ సాకేత్ ప్రాంతంలో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వారిద్దరికీ చికిత్స చేస్తున్నారు. ఇటీవల జ్యోతిరాదిత్యకు కోవిడ్ లక్షణాలు బయటపడడంతో సోమవారం మాక్స్ ఆస్పత్రిలో చేరారు. జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్న జ్యోతిరాదిత్యకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. జ్యోతిరాదిత్య తల్లి మాధవి రాజె సింధియాకు లక్షణాలేవీ లేకపోయినా ఆమెకు పరీక్షలు చేస్తే పాజిటివ్ వచ్చింది. వారిద్దరూ త్వరగా కోలుకోవాలంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు. ‘మాతాజీ, జ్యోతిరాదిత్య అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసింది. వారిద్దరూ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని చౌహాన్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment