న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో పొరపాటు చేశారు. ఆయన చెప్పిన వాటికి సంబంధం లేని ఫొటోలను పెట్టి వాటికి కొత్త అంశాన్ని ఆపాదించి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అనంతరం అసలు విషయం తెలిసి వెంటనే తన ఖాతా నుంచి తొలగించారు. ఇదేమిటని ప్రశ్నించినా ఆయన ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఆదివారం సీఎం కేజ్రీవాల్ తన ఖాతాలో రెండు ఫొటోలు పోస్ట్ చేశారు.
అందులో ఒకటి సిరియా శరణార్ధుల ఫొటో కాగా, ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న రైలు ప్రమాద స్థలం వద్ద గాయాలతో కనిపిస్తున్న చిన్నారులు అంటూ ఫొటో రైటప్ పెట్టి పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఓ యువకుడు సాత్నా ఉరేసుకున్న ఫొటోను పోస్ట్ చేశారు. దానికి క్యాప్షన్ గా పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నాలుగు రోజులుగా బ్యాంకు వద్ద పడిగాపులు కాసి చివరకు డబ్బు అందకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు అంటూ పెట్టారు. దీని గురించి ఇప్పటికైనా ఆలోచించండి మోదీ గారు అంటూ ఆయన ప్రశ్నించారు. అయితే, వాస్తవానికి ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు కానీ, డబ్బు లభించక కాదు.
బేలా అనే గ్రామంలో అలహాబాద్ బ్యాంకు వద్దకు వచ్చిన యువకుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అయితే, పోలీసులు చుట్టుముట్టడంతో తానిక వారి నుంచి తప్పించుకోలేనని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఫొటోను కేజ్రీవాల్ పోస్ట్ చేసి దానికి వేరే తప్పుడు క్యాప్షన్ పెట్టారు. చివరకు అసలు విషయం తెలిసి ఆ రెండు ఫొటోలు క్యాప్షన్ తీసేశారు. గతంలో కూడా కేజ్రీవాల్ ఇలా తప్పులో కాలేశారు.
తప్పులో కాలేసిన కేజ్రీ.. జవాబుకు నో
Published Mon, Nov 21 2016 3:55 PM | Last Updated on Sat, Aug 25 2018 6:37 PM
Advertisement