ముఖ్యమంత్రికి ఇంకా తగ్గని జ్వరం
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ఒక్క రోజు మాత్రమే గడువున్నా.. ఇంకా అరవింద్ కేజ్రీవాల్ మాత్రం మఫ్లర్ విప్పలేకపోతున్నారు. ఆయన ప్రస్తుతం తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. గత నాలుగు రోజులుగా కేజ్రీవాల్ను పట్టుకున్న జ్వరం.. అంత త్వరగా వీడి వెళ్లనంటోంది. అంత జ్వరంలోనే ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధానమంత్రి నరేంద్రమోదీని, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు తదితరులను గత రెండు మూడు రోజులుగా కలుస్తూ ఉన్నారు. ఇంకా రెండు మూడు సమావేశాలకు కేజ్రీవాల్ హాజరుకావాల్సి ఉందని ఆప్ నాయకుడు ఒకరు చెప్పారు.
శుక్రవారం నాడు కూడా సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రయత్నించినా.. ఆయన కూర్చోలేకపోయారు. దాంతో సమావేశాలను రద్దుచేసుకున్నారు. మంగళవారం నాటి విజయోత్సవ సంబరాలను కూడా సగంలోనే వదిలేసి.. జ్వరం కారణంగా కౌశాంబిలోని తన ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. కేజ్రీవాల్కు గొంతునొప్పి కూడా తీవ్రంగా ఉండటంతో మాట్లాడటం కూడా కష్టమవుతోంది.