DELHI CM CANDIDATE
-
ముఖ్యమంత్రికి ఇంకా తగ్గని జ్వరం
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ఒక్క రోజు మాత్రమే గడువున్నా.. ఇంకా అరవింద్ కేజ్రీవాల్ మాత్రం మఫ్లర్ విప్పలేకపోతున్నారు. ఆయన ప్రస్తుతం తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. గత నాలుగు రోజులుగా కేజ్రీవాల్‌ను పట్టుకున్న జ్వరం.. అంత త్వరగా వీడి వెళ్లనంటోంది. అంత జ్వరంలోనే ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధానమంత్రి నరేంద్రమోదీని, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు తదితరులను గత రెండు మూడు రోజులుగా కలుస్తూ ఉన్నారు. ఇంకా రెండు మూడు సమావేశాలకు కేజ్రీవాల్ హాజరుకావాల్సి ఉందని ఆప్ నాయకుడు ఒకరు చెప్పారు. శుక్రవారం నాడు కూడా సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రయత్నించినా.. ఆయన కూర్చోలేకపోయారు. దాంతో సమావేశాలను రద్దుచేసుకున్నారు. మంగళవారం నాటి విజయోత్సవ సంబరాలను కూడా సగంలోనే వదిలేసి.. జ్వరం కారణంగా కౌశాంబిలోని తన ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. కేజ్రీవాల్‌కు గొంతునొప్పి కూడా తీవ్రంగా ఉండటంతో మాట్లాడటం కూడా కష్టమవుతోంది. -
ఢిల్లీ సీఎం అభ్యర్థిపై బీజేపీలో సందిగ్థత
న్యూఢిల్లీ: బీజేపీలో ఢిల్లీ సీఎం అభ్యర్థిపై సందిగ్థత నెలకొంది. ఎన్నికల ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించాలని పార్టీలోని కొందరు నేతలు చేసిన విజ్ఞప్తిని సీనియర్లు తోసిపుచ్చారు. పార్టీలో కొత్త సంప్రదాయాలకు తెరతీయొద్దని వారికి సూచించారు. ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని సీనియర్లు స్పష్టం చేశారు. అయితే నిన్న కాక మొన్న వచ్చిన కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని సీనియర్లు ఆలోచనలో పడ్డారు. హస్తిన ప్రజల్లో కిరణ్ బేడీకి మంచి పేరు ఉందని వారు బీజేపీ సీనియర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై కిరణ్ బేడీని పోటీకి నిలపాలని వారు నిర్ణయించినట్లు సమాచారం. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన న్యూఢిల్లీ పార్టీ అధ్యక్షుడు మూడో స్థానంలో నిలిచారు. దాంతో కిరణ్ బేడీనే బరిలో నిలపాలని సీనియర్లు సమాలోచనలు చేస్తున్నారని తెలిసింది. -
బీజేపీ గెలిస్తే మహిళా సీఎం?
సాక్షి, న్యూఢిల్లీ: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ లభిస్తే మహిళను ముఖ్యమంత్రి పదవి వరించే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేది లేదని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ పార్టీకి అధికారం చేజిక్కితే మహిళా నేతకు సీఎం పదవి కట్టబెట్టవచ్చని ఆ వర్గాలు అంటున్నాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ లేదా న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షీ లేఖికి ఈ పదవి కట్టబెట్టే యోచన ఉందని వారు అంటున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేసులో కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, బీజేపీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ, సీనియర్ నేత జగ్దీశ్ ముఖి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కానీ ఢిల్లీ బీజేపీలో నెలకొన్న అంతర్గత కలహాల కారణంగా అధిష్టానం మాత్రం స్మృతి ఇరానీ లేదా మీనాక్షీ లేఖీ వైపు మొగ్గు చూపవచ్చని వారు అంటున్నారు. స్మృతి ఇరానీ అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇటు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాకు సన్నిహితురాలు కావడంతో ముఖ్యమంత్రి పదవి ఆమెను వరించే అవకాశాలు అధికంగా ఉన్నాయని వారు అంటున్నారు. సీఎం పదవి కోసం మీనాక్షీ లేఖి పేరు కూడా గత కొంత కాలంగా వినిపిస్తోంది. ఢిల్లీ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే గ్రూపు మీనాక్షి లేఖి పేరు మీద పోస్టర్లు కూడా అతికించింది. వివాదరహితురాలు కావడం, నిజాయితీ గల నే తగా ఆమెకున్న పేరు, బీజేపీ ప్రతినిధిగా ఆమె ప్రదర్శించిన వాక్ఫటిమల దృష్ట్యా సీఎం పదవి ఆమెను వరించవచ్చని కొందరు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్న ఇతర పార్టీ నేతల విషయానికి వస్తే డాక్టర్ హర్షవర్ధన్‌కు మిగతా నేతల కన్నా ఎక్కువ అవకాశాలున్నాయి. ఇటీవల ఆయన శాఖ మార్చి అంతగా ప్రాధాన్యం లేని మంత్రిత్వశాఖను కేటాయించడం కూడా వర్ధన్ ఢిల్లీ సీఎం రేసులో ఉన్నారన్న ఊహాగానాలకు తావిచ్చింది. ఆయనకు నిజాయితీ గల నేతగా, సమర్ధుడిగా పేరుంది. పార్టీ ఆయన నేతృత్వంలోనే గత అసెంబ్లీ ఎన్నికలలో 32 సీట్లు గెలిచింది. అయితే హర్షవర్ధన్ ప్రధాని నరేంద్ర మోడీ కూటమికి చెందిన నేత కాకపోవడం ఆయనకు పెద్ద మైనస్ పాయింట్‌గా మారింది.సతీష్ ఉపాధ్యాయ బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడిగా మంచి సామర్థ్యాన్ని కనబరుస్తున్నారు. నిబద్దత గల కార్యకర్తగా ఆయనకు పేరుంది. సీఎం పదవి మీద ఆయన ఇంతవరకు కోరిక కనబరచలేదు. అయితే ఢిల్లీ ప్రజలను ఆకట్టుకోగల వ్యక్తిత్వం ఆయనకు లేకపోవడం మైనస్ పాయింట్‌గా మారింది. మరో నేత జగ్దీశ్ ముఖి విషయానికి వస్తే ఆయనకు పార్టీలోని అన్ని వర్గాల నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల తరువాతి నుంచి ఆయన ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా సోషల నెట్ వర్కింగ్ సైట్లు, పోస్టర్ల ద్వారా ఆయన పేరు మీద జోరుగా ప్రచారం జరిగింది. ఆయితే ఈ సీనియర్ నేతకు పరిపాలనా అనుభవం పుష్కలంగా ఉన్నప్పటికీ వయసు పెద్ద ప్రతిబంధకంగా మారింది. పెద్ద వయసు గల ఆయనకు సీఎం కుర్చీనిస్తే యువనేతలలో, యువ మద్దతుదారులలో అసంతృప్తి తలెత్తవచ్చని అంటున్నారు. పార్టీ నేతలు కూడా ఆయన పేరు బలపరచకపోవచ్చని అంటున్నారు. మరో నేత రాజ్యసభ ఎంపీ విజయ్ గోయల్ కూడా ముఖ్యమంత్రి పదవిపై ఆశలు కనబరుస్తున్నప్పటికీ పార్టీ ఆయన పేరును పూర్తిగా పక్కనపెట్టిందని అంటున్నారు. -
లిస్టులో ఫస్టెవరో!!
సాక్షి, న్యూఢిల్లీ:ఎన్నికల పరుగులో లక్ష్యాన్ని ముద్దాడాలంటే ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా వేయాలి. మొదటి అడుగు మరింత కీలకం. ఇలా చూస్తే ఎన్నికల్లో మొదటి అంకం పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం. అసలు కథంతా ఇక్కడే దాగి ఉంటుంది. సరైన అభ్యర్థిని బరిలోకి దింపితేనే అధికార పీఠం దక్కుతుంది. వివిధ కారణాల రీత్యా అభ్యర్థుల జాబితాను వెల్లడించేందుకు పార్టీలు తాత్సారం చేస్తున్నాయి. ఎదుటి పార్టీ నిలబెట్టే అభ్యర్థిని బట్టి తాము బరిలోకి దింపాలన్న యోచనతో ఉన్నాయి. ఎన్నికలకు మరో 35 రోజులే గడువున్నా ప్రధాన పార్టీలు జాబితాలు విడుదల చేయడం లేదు. బీజేపీ సీఎం అభ్యర్థిగా హర్షవర్ధన్ పేరును ప్రకటించడంతో బీజే పీ స్పీడుకి బ్రేకులు పడ్డాయి. నేర చరితులు లేకుండా, కొత్తవారికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్న నియమాలు తెరపైకి రావడంతో కాంగ్రెస్ పార్టీ తర్జనభర్జనలు పడుతోంది. ఇరుపార్టీల అభ్యర్థులు తెలిస్తేకానీ రంగంలోకి దిగొద్దని బీఎస్పీ కాసుకూచ్చుంది. అన్నింటికి పరోక్షంగా ఆప్ అనుసరిస్తున్న వ్యూహమూ కారణమవుతోంది. దీంతో అన్ని పార్టీల్లోని ఆశావహులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఉన్నదంతా ఖర్చుచేసుకుని మరి తమవంతు ‘ప్రయత్నాలు’చేసుకుంటున్నారు. అభ్యర్థు జాబితా విడుదలలో తాత్సారం ఏ క్షణాన ఎవరి కొంప ముంచుతుందో తెలియక తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. వర్గపోరుతో నెమ్మదించిన బీజేపీ బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్‌ను కాదని సచ్చీలుడైన వ్యక్తి కావాలంటూ డా.హర్షవర్ధన్ పార్టీ సీఎం అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీ స్పీడు కాస్త తగ్గింది. అంతకముందు తాను సీఎం అభ్యర్థిని అన్న ఉత్సాహంతో పార్టీ అధ్యక్షుడు విజయ్‌గోయల్ అంతా తానై నడిపించారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సంసిద్ధం చేయడంతోపాటు తన వర్గంలోని వారికి టిక్కెట్లు వచ్చేలా ప్రణాళిలకు రూపొందించి పెట్టుకున్నారు. ఆఖరి నిమిషంలో పార్టీ అధిష్టానం షాక్ ఇవ్వడంతో గోయల్ తెల్లబోయారు. సీఎం అభ్యర్థి హర్షవర్ధన్‌తో పైకి సఖ్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నా.. అభ్యర్థుల ఎంపికలో తన ముద్ర ఉండేలా ఎత్తులు వేస్తున్నట్టు సమాచారం. సీఎం అభ్యర్థిత్వంలో ఇప్పటికే పార్టీ బుజ్జగింపులకు తలొగ్గిన విజయ్‌గోయల్...పార్టీ టిక్కెట్ల విషయంలో పట్టుబట్టేలా కనిపిస్తోంది. దీంతో దీపావళికి ముందే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని బహిరంగంగా ప్రకటనలు చేసిన బీజేపీ కాస్త వెనుకడుగు వేస్తున్నట్టు పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. సీఎం అభ్యర్థిని ప్రకటించడంలో చేసినట్టే అభ్యర్థుల జాబితా విడుదలలో జాప్యం పార్టీ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్జన భర్జనల్లో కాంగ్రెస్... కాంగ్రెస్‌లో పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ వర్గపోరునకు మించి ఇతర అర్హతలు ఆశావహుల తలరాతలు మారుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సిటింగ్ ఎమ్మెల్యేలలో వీలైనంత ఎక్కువ మందికి మరోమారు అవకాశం ఇవ్వాలని పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సైతం ఇప్పటికే 31 మందికి ఆమోదం తెలిపినట్టు సమాచారం. నేర చరిత్ర, వయస్సును పరిగణనలోకి తీసుకుని కొందరిని పక్కన పెట్టాలని నిర్ణయించారు. పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను దీపావళి తర్వాత విడుదల చేయాలన్న యోచనలో కాంగ్రెస్‌పార్టీ అధిష్టాన వర్గం ఉన్నట్టు పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ప్రధాన పార్టీలను ‘ఆప్’తున్న కేజ్రీవాల్.. తొలిసారిగా ఢిల్లీ విధానసభ ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆమ్ఆద్మీపార్టీ కొత్త పంథాలో వెళుతూ ఇతర పార్టీలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ అభ్యర్థుల ఎంపికలో ఆమ్ఆద్మీపార్టీ నిజాయితీ కలిగిన అభ్యర్థులకే సీట్లు వచ్చేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. గత రెండు నెలలుగా పార్టీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన పూర్తి వివరాలు పార్టీ వెబ్సైట్ ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నారు. దీంతో ఇతర పార్టీలు సైతం ఆయా నియోజకవర్గాల్లో ఉన్నంతలో కాస్త నిజాయితీ కలిగిన నాయకులకు టికెట్ ఇవ్వాలన్న ధోరణిలో ఉన్నాయి. ఈ సరికొత్త విధానం ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితా విడుదలలో ఓ కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక బీఎస్పీ సైతం ఆచితూచి వ్యవహరిస్తోంది. డిసెంబర్ నాలుగున జరగనున్న ఎన్నికల్లో పార్టీ మొత్తం 70 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తుండగా, ఇప్పటికే 63 స్థానాలు సంబంధించి అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైనట్టు బీఎస్పీ ఢిల్లీప్రదేశ్ నాయకుడు ఎమ్.ఎల్.తోమర్ పేర్కొన్నారు. కాంగ్రెస్,బీజేపీ జాబితాల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.