సాక్షి, న్యూఢిల్లీ: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ లభిస్తే మహిళను ముఖ్యమంత్రి పదవి వరించే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేది లేదని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ పార్టీకి అధికారం చేజిక్కితే మహిళా నేతకు సీఎం పదవి కట్టబెట్టవచ్చని ఆ వర్గాలు అంటున్నాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ లేదా న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షీ లేఖికి ఈ పదవి కట్టబెట్టే యోచన ఉందని వారు అంటున్నారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి రేసులో కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, బీజేపీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ, సీనియర్ నేత జగ్‌దీశ్ ముఖి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కానీ ఢిల్లీ బీజేపీలో నెలకొన్న అంతర్గత కలహాల కారణంగా అధిష్టానం మాత్రం స్మృతి ఇరానీ లేదా మీనాక్షీ లేఖీ వైపు మొగ్గు చూపవచ్చని వారు అంటున్నారు. స్మృతి ఇరానీ అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇటు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాకు సన్నిహితురాలు కావడంతో ముఖ్యమంత్రి పదవి ఆమెను వరించే అవకాశాలు అధికంగా ఉన్నాయని వారు అంటున్నారు. సీఎం పదవి కోసం మీనాక్షీ లేఖి పేరు కూడా గత కొంత కాలంగా వినిపిస్తోంది. ఢిల్లీ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే గ్రూపు మీనాక్షి లేఖి పేరు మీద పోస్టర్లు కూడా అతికించింది. వివాదరహితురాలు కావడం, నిజాయితీ గల నే తగా ఆమెకున్న పేరు, బీజేపీ ప్రతినిధిగా ఆమె ప్రదర్శించిన వాక్ఫటిమల దృష్ట్యా సీఎం పదవి ఆమెను వరించవచ్చని కొందరు భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేసులో ఉన్న ఇతర పార్టీ నేతల విషయానికి వస్తే డాక్టర్ హర్షవర్ధన్‌కు మిగతా నేతల కన్నా ఎక్కువ అవకాశాలున్నాయి. ఇటీవల ఆయన శాఖ మార్చి అంతగా ప్రాధాన్యం లేని మంత్రిత్వశాఖను కేటాయించడం కూడా వర్ధన్ ఢిల్లీ సీఎం రేసులో ఉన్నారన్న ఊహాగానాలకు తావిచ్చింది. ఆయనకు నిజాయితీ గల నేతగా, సమర్ధుడిగా పేరుంది. పార్టీ ఆయన నేతృత్వంలోనే గత అసెంబ్లీ ఎన్నికలలో 32 సీట్లు గెలిచింది. అయితే హర్షవర్ధన్ ప్రధాని నరేంద్ర మోడీ కూటమికి చెందిన నేత కాకపోవడం ఆయనకు పెద్ద మైనస్ పాయింట్‌గా మారింది.సతీష్ ఉపాధ్యాయ బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడిగా మంచి సామర్థ్యాన్ని కనబరుస్తున్నారు. నిబద్దత గల కార్యకర్తగా ఆయనకు పేరుంది. సీఎం పదవి మీద ఆయన ఇంతవరకు కోరిక కనబరచలేదు. అయితే ఢిల్లీ ప్రజలను ఆకట్టుకోగల వ్యక్తిత్వం ఆయనకు లేకపోవడం మైనస్ పాయింట్‌గా మారింది.
మరో నేత జగ్‌దీశ్ ముఖి విషయానికి వస్తే ఆయనకు పార్టీలోని అన్ని వర్గాల నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల తరువాతి నుంచి ఆయన ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా సోషల నెట్ వర్కింగ్ సైట్లు, పోస్టర్ల ద్వారా ఆయన పేరు మీద జోరుగా ప్రచారం జరిగింది. ఆయితే ఈ సీనియర్ నేతకు పరిపాలనా అనుభవం పుష్కలంగా ఉన్నప్పటికీ వయసు పెద్ద ప్రతిబంధకంగా మారింది. పెద్ద వయసు గల ఆయనకు సీఎం కుర్చీనిస్తే యువనేతలలో, యువ మద్దతుదారులలో అసంతృప్తి తలెత్తవచ్చని అంటున్నారు. పార్టీ నేతలు కూడా ఆయన పేరు బలపరచకపోవచ్చని అంటున్నారు. మరో నేత రాజ్యసభ ఎంపీ విజయ్ గోయల్ కూడా ముఖ్యమంత్రి పదవిపై ఆశలు కనబరుస్తున్నప్పటికీ పార్టీ ఆయన పేరును పూర్తిగా పక్కనపెట్టిందని అంటున్నారు.
బీజేపీ గెలిస్తే మహిళా సీఎం?
Published Wed, Nov 19 2014 10:25 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement