లిస్టులో ఫస్టెవరో!! | Harsh Vardhan is BJP's Delhi CM candidate; Vijay Goel says 'not upset' | Sakshi
Sakshi News home page

లిస్టులో ఫస్టెవరో!!

Published Wed, Oct 30 2013 1:29 AM | Last Updated on Fri, Mar 29 2019 9:13 PM

Harsh Vardhan is BJP's Delhi CM candidate; Vijay Goel says 'not upset'

సాక్షి, న్యూఢిల్లీ:ఎన్నికల పరుగులో లక్ష్యాన్ని ముద్దాడాలంటే ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా వేయాలి. మొదటి అడుగు మరింత కీలకం. ఇలా చూస్తే ఎన్నికల్లో మొదటి అంకం పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం. అసలు కథంతా ఇక్కడే దాగి ఉంటుంది. సరైన అభ్యర్థిని బరిలోకి దింపితేనే అధికార పీఠం దక్కుతుంది. వివిధ కారణాల రీత్యా అభ్యర్థుల జాబితాను వెల్లడించేందుకు పార్టీలు తాత్సారం చేస్తున్నాయి. ఎదుటి పార్టీ నిలబెట్టే అభ్యర్థిని బట్టి తాము బరిలోకి దింపాలన్న యోచనతో ఉన్నాయి. ఎన్నికలకు మరో 35 రోజులే గడువున్నా ప్రధాన పార్టీలు జాబితాలు విడుదల చేయడం లేదు. బీజేపీ సీఎం అభ్యర్థిగా హర్షవర్ధన్ పేరును ప్రకటించడంతో బీజే పీ స్పీడుకి బ్రేకులు పడ్డాయి. 
 
 నేర చరితులు లేకుండా, కొత్తవారికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్న నియమాలు తెరపైకి రావడంతో కాంగ్రెస్ పార్టీ తర్జనభర్జనలు పడుతోంది. ఇరుపార్టీల అభ్యర్థులు తెలిస్తేకానీ రంగంలోకి దిగొద్దని బీఎస్పీ కాసుకూచ్చుంది. అన్నింటికి పరోక్షంగా ఆప్ అనుసరిస్తున్న వ్యూహమూ కారణమవుతోంది. దీంతో అన్ని పార్టీల్లోని ఆశావహులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఉన్నదంతా ఖర్చుచేసుకుని మరి తమవంతు ‘ప్రయత్నాలు’చేసుకుంటున్నారు. అభ్యర్థు జాబితా విడుదలలో తాత్సారం ఏ క్షణాన ఎవరి కొంప ముంచుతుందో తెలియక తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
 
 వర్గపోరుతో నెమ్మదించిన బీజేపీ 
 బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్‌ను కాదని సచ్చీలుడైన వ్యక్తి కావాలంటూ డా.హర్షవర్ధన్ పార్టీ సీఎం అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీ స్పీడు కాస్త తగ్గింది. అంతకముందు తాను సీఎం అభ్యర్థిని అన్న ఉత్సాహంతో పార్టీ అధ్యక్షుడు విజయ్‌గోయల్ అంతా తానై నడిపించారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సంసిద్ధం చేయడంతోపాటు తన వర్గంలోని వారికి టిక్కెట్లు వచ్చేలా ప్రణాళిలకు రూపొందించి పెట్టుకున్నారు. ఆఖరి నిమిషంలో పార్టీ అధిష్టానం షాక్ ఇవ్వడంతో గోయల్ తెల్లబోయారు. 
 
 సీఎం అభ్యర్థి హర్షవర్ధన్‌తో పైకి సఖ్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నా.. అభ్యర్థుల ఎంపికలో తన ముద్ర ఉండేలా ఎత్తులు వేస్తున్నట్టు సమాచారం. సీఎం అభ్యర్థిత్వంలో ఇప్పటికే పార్టీ బుజ్జగింపులకు తలొగ్గిన విజయ్‌గోయల్...పార్టీ టిక్కెట్ల విషయంలో పట్టుబట్టేలా కనిపిస్తోంది. దీంతో దీపావళికి ముందే అభ్యర్థుల  జాబితా విడుదల చేస్తామని బహిరంగంగా ప్రకటనలు చేసిన బీజేపీ కాస్త వెనుకడుగు వేస్తున్నట్టు పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. సీఎం అభ్యర్థిని ప్రకటించడంలో చేసినట్టే అభ్యర్థుల జాబితా విడుదలలో జాప్యం పార్టీ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 తర్జన భర్జనల్లో కాంగ్రెస్...
 కాంగ్రెస్‌లో  పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ వర్గపోరునకు మించి ఇతర అర్హతలు ఆశావహుల తలరాతలు మారుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సిటింగ్ ఎమ్మెల్యేలలో వీలైనంత ఎక్కువ మందికి మరోమారు అవకాశం ఇవ్వాలని పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సైతం ఇప్పటికే 31 మందికి ఆమోదం తెలిపినట్టు సమాచారం. నేర చరిత్ర, వయస్సును పరిగణనలోకి తీసుకుని కొందరిని పక్కన పెట్టాలని నిర్ణయించారు. పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను దీపావళి తర్వాత విడుదల చేయాలన్న యోచనలో కాంగ్రెస్‌పార్టీ అధిష్టాన వర్గం ఉన్నట్టు పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.
 
 ప్రధాన పార్టీలను ‘ఆప్’తున్న కేజ్రీవాల్..
 తొలిసారిగా ఢిల్లీ విధానసభ ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆమ్‌ఆద్మీపార్టీ కొత్త పంథాలో వెళుతూ ఇతర పార్టీలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ అభ్యర్థుల ఎంపికలో ఆమ్‌ఆద్మీపార్టీ నిజాయితీ కలిగిన అభ్యర్థులకే సీట్లు వచ్చేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. గత రెండు నెలలుగా పార్టీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన పూర్తి వివరాలు పార్టీ వెబ్‌సైట్ ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నారు. దీంతో ఇతర పార్టీలు సైతం ఆయా నియోజకవర్గాల్లో ఉన్నంతలో కాస్త నిజాయితీ కలిగిన నాయకులకు టికెట్ ఇవ్వాలన్న ధోరణిలో ఉన్నాయి.
 
 ఈ సరికొత్త విధానం ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితా విడుదలలో ఓ కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక బీఎస్పీ సైతం ఆచితూచి వ్యవహరిస్తోంది. డిసెంబర్ నాలుగున జరగనున్న ఎన్నికల్లో పార్టీ మొత్తం 70 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తుండగా, ఇప్పటికే 63 స్థానాలు సంబంధించి అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైనట్టు బీఎస్పీ ఢిల్లీప్రదేశ్ నాయకుడు ఎమ్.ఎల్.తోమర్ పేర్కొన్నారు. కాంగ్రెస్,బీజేపీ జాబితాల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement