న్యూఢిల్లీ: ఎన్డీఏ సర్కారు తీసుకొచ్చిన భూసేకరణ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన రైతు సంఘాల ప్రతినిధులు పార్లమెంటు ప్రాంగణం దగ్గర భారీ నిరసన ప్రదర్శన జరిపారు. కేరళ భవన్ నుంచి పార్లమెంటు దాకా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ‘భూ సేకరణ కాదు.. భూమిపై అధికారం కావాలి.. అంటూ నినాదాలు చేశారు. ఓ పక్క జంతర్‌మంతర్ వద్ద అన్నా దీక్ష కొనసాగుతుండగానే రైతు సంఘాల ర్యాలీ కొనసాగింది. పార్లమెంట్ స్ట్రీట్ వద్ద నిరసన కారులకు నర్మదాబచావ్ ఆందోళన నాయకురాలు మేధాపాట్కర్ సంఘీభావం తెలిపా రు.
ఎండీఎంకే నేత వైకో, సీపీఐ అనుబంధ సంస్థ ఆల్ ఇండియా కిసాన్‌సభ ప్రధాన కార్యదర్శి అతుల్‌అంజన్, సీపీఎం నాయకుడు హనన్ మొల్లా ఈ నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహించారు. భూసేకరణ బిల్లును పార్టీలకు అతీతంగా అందరూ వ్యతిరేకించాలని వివిధ రైతు సంఘాలు అన్ని పార్టీల ఎంపీలకు బహిరంగ లేఖ రాశాయి. వంద రోజుల్లో ప్రతి ఒక్కరి ఖాతాల్లో 15 లక్షలు జమ చేస్తామని హామీ ఇచ్చిన మోదీకి తాము ఏడాది సమయమిస్తున్నామని, ఒకవేళ చేయకపోతే పార్లమెంటును ముట్టడిస్తామని రైతు సంఘాలు హెచ్చరించాయి.
భూసేకరణకు వ్యతిరేకంగా రైతు సంఘాల ప్రదర్శన
Published Wed, Feb 25 2015 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM