జోథ్ పూర్: ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూపై నమోదైన కేసు చాలా బలంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఆశారాంపై ఆరోపణలు రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా డీసీపీ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆశారాంను విచారించడానికి మరికొన్ని రోజులు గడువు కోరతామని ఆయన తెలిపారు. కాగా, ఆశారాం బాపూ న్యూమోనియాతో బాధ పడుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. అతను శారీరకంగా, మానసికంగా చాలా ధృడంగా ఉన్నారని తెలిపారు. ఆశారాంను త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టి మరికొన్ని రోజులు విచారణ అనుమతి కోరతామన్నారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును శనివారం రాత్రి ఇండోర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఆశారాం అరెస్టుకు ముందు హైడ్రామా నడిచింది. ఆయన పోలీసులకు చిక్కకుండా దాక్కున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, ఆయన ఇండోర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన కుమారుడు నారాయణ్ సాయి చెప్పారు.