
14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఆశారాం
జోథ్ పూర్:ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూను 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ జోథ్ పూర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పదహారేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆశారాం ఆరోపణలు రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా డీసీపీ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆశారాంను విచారించడానికి మరికొన్ని రోజులు పోలీసులు గడువు కోరడంతో కోర్టు సానుకూలంగా స్పందించింది. అతన్ని 14 రోజులు పోలీసుల కస్టడీలో ఉంచి దర్యాప్తు చేయాలని సూచించింది. అంతకుముందు మీడియాతో మాట్లాడిన డీసీపీ .. ఆశారాం బాపూ శారీరకంగా, మానసికంగా చాలా ధృడంగా ఉన్నారని తెలిపారు. న్యూమోనియాతో బాధ పడుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును శనివారం రాత్రి ఇండోర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఆశారాం అరెస్టుకు ముందు హైడ్రామా నడిచింది. ఆయన పోలీసులకు చిక్కకుండా దాక్కున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, ఆయన ఇండోర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన కుమారుడు నారాయణ్ సాయి చెప్పారు.