మేజర్ ముకుంద్‌కు అశోకచక్ర
12 మందికి శౌర్యచక్ర
మొత్తం 55 మందికి సాహస
పతకాలను ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చి, అమరుడైన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్(31)కు శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత శౌర్య పతకం అశోక చక్రను కేంద్రం ప్రకటించింది. అలాగే విధి నిర్వహణలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన మరో 12 మందికి దేశ మూడో అత్యున్నత శౌర్య పతకమైన శౌర్య చక్ర ప్రకటించింది. వీరిలో నలుగురు మరణానంతరం ఈ పతకానికి ఎంపికయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది సాయుధ బలగాల సిబ్బందికి మొత్తం 55 శౌర్య పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది.
వీటిలో ఒక అశోక చక్ర, 12 శౌర్య చక్ర, 39 సేనా పతకాలు, ఒక నవో సేనా పతకం, 2 వాయు సేనా పతకాలు ఉన్నాయి. కాగా, 44 రాష్ట్రీయ రైఫిల్స్‌కు నేతృత్వం వహించిన మేజర్ ముకుంద్ కాశ్మీర్‌లోని ఖాజీపత్రి గ్రామం వద్ద ఉగ్రవాదులతో హోరాహోరీ తలపడి ఇద్దరిని హతమార్చారు. రక్తమోడుతున్నా.. నేలపై పాకుతూ వెళ్లి వారిని కాల్చిచంపి, ఎన్నికల సిబ్బందిని కాపాడారు. ఈ సంఘటనలో మూడో ఉగ్రవాదిని చంపిన మరో వీర సైనికుడికీ మరణానంతరం శౌర్యచక్ర లభించింది.