డయాస్ కూలి బీజేపీ నేతలు కిందపడ్డారు
దిబ్రూగఢ్: అసోంలో బీజేపీ నిర్వహిస్తున్న ఓ సభలో అపశృతి చోటుచేసుకుంది. బీజేపీకి చెందిన యువమోర్చా ఓ కార్యక్రమం నిర్వహిస్తుండగా దానికి సంబంధించిన డయాస్ కూలిపోయి కేంద్ర క్రీడాశాఖమంత్రితో సహా 15 మంది గాయాలపాలయ్యారు. వారిలో కొందరికి మోస్తరు గాయాలుకాగా మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. అసోంలోని బీజేపీ అనుభంద శాఖ అయిన బీజేపీ యువ మోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు సోమవారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసింది.
25 మంది అతిథులు ఆశీన్నులయ్యేలా డయాస్ను ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర క్రీడాశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, బీజేపీ సీనియర్ నేత ఉజ్వల్ కశ్యప్, ఎంపీలు కామాఖ్య ప్రసాద్, రామేశ్వర్ తేలి హాజరయ్యారు. అయితే, ఒక్కసారిగా డయాస్ మీదకు పరిమితికి మించి రెట్టింపుగా దాదాపు 150 మంది ఎక్కారు. వీరంతా కార్యక్రమానికి వచ్చిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్కు అభినందనలు తెలిపేందుకు ఎగబడ్డారు. దాంతో అది ఒక్కసారిగా కుప్పకూలి స్వల్ప గాయాలపాలయ్యారు. వెంటనే అక్కడికి వైద్యులు చేరుకొని ప్రథమ చికిత్సలు అందించారు.