బాలాసోర్: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించిన గగనతలం నుంచి గగనతలానికి లక్ష్యాలను ఛేదించే అస్త్ర క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని బంగాళాఖాతం సముద్ర తీర ప్రాంతంలో అస్త్ర క్షిపణిని భారత వైమానిక దళం పరీక్షించింది. సుఖోయ్–30 ఎంకేఐ ద్వారా అస్త్రను ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు. అస్త్ర సమర్థంగా, అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించిందని రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘వివిధ రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ (ఈవోటీఎస్), సెన్సార్లు అస్త్ర క్షిపణి గమనాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి చూశాయని, ఎంతో కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని వెల్లడైందని‘ ఆ ప్రకటన తెలిపింది. ఈ సందర్భంగా డీఆర్‌డీఓ, వాయుసేన బృందానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం వాయుసేన రష్యాకు చెందిన సుఖోయ్ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది. భవిష్యత్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన ఐ–డెర్బీ, స్వదేశీయంగా రూపొందించిన అస్త్రను వాయుసేనలో చేర్చడానికి సన్నాహాలు చేస్తోంది.
అస్త్ర ప్రత్యేకతలు
- డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ), మరో 50 ఇతర ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థలతో కలిసి అస్త్ర క్షిపణిని పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు.
- గాల్లో నుంచి గాల్లోకి 70 కి.మీ. పరిధిలో ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది. ఈ పరిధిని 300 కి.మీ.లకు పెంచడానికి డీఆర్‌డీఓ ప్రణాళికలు రూపొందిస్తోంది.
- నిర్దేశిత లక్ష్యానికి చేరుకోవడానికి ఈ క్షిపణి గంటకి 5,555 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది.
- 15 కిలోగ్రాముల పేలుడు పదార్థాలతో ప్రత్యేకమైన వార్‌హెడ్ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment