
92 ఏళ్ల వయసులోనూ ఎన్నికల పోరుకు రెడీ!
ఆయన మార్క్సిస్టు కురువృద్ధుడు. వయసు ఏకంగా 92 ఏళ్లు. అయినా కూడా ఎన్నికల పోరుకు సై అంటున్నారు. ఆయనే కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. తన పార్టీ సరేనంటే తాను పోటీ చేయడం ఖాయమని ఆయన విలేకరులతో అన్నారు. 1967లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఇప్పటికి ఆరుసార్లు శాసనసభలో అడుగుపెట్టారు. ప్రస్తుతం సభలో ప్రతిపక్ష నేత. 1996లో మాత్రం తొలిసారిగా.. పార్టీలో అంతర్గత కుమ్ములాటల కారణంగా ఓడిపోయారు.
ప్రజాభిమానం మెండుగా ఉన్న ఆయన.. 2006-11 సంవత్సరాల మధ్య కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2011 నుంచి ఇప్పటివరకు ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. ఈసారి ముఖ్యమంత్రి పదవికి మరో ప్రధాన నేత పినరయి విజయన్ కూడా పోటీ పడుతున్నారు. ఒకవేళ వామపక్షాలు విజయం సాధిస్తే మాత్రం.. అచ్యుతానందన్, విజయన్‌ల మధ్య సీఎం పదవికి గట్టిపోటీయే ఉంటుందని చెబుతున్నారు.