శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్లోని కొన్ని ప్రాంతాల్లో అధికారులు ఆంక్షలు విధించారు. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో వేర్పాటువాదులు ఈ ఉత్సవాలను జరుపుకోకుండా నివారించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఖన్యార్, నౌహట్టా, రెయిన్వరి, ఎమ్ ఆర్ గంజ్, మైసమ్మ, క్రాల్కుద్, సఫా కాదాల్ ప్రాంతాల్లో శాంతి భద్రతలకు భంగం వాటిల్లవచ్చని భావించి ఈ ఏరియాలలో కొన్ని ఆంక్షలు విధించినట్లు సీనియర్ పోలీసు అధికారి మీడియాకు వెల్లడించారు. ప్రస్తుత హురియత్ గ్రూప్ చైర్మన్ మిర్వేజ్ ఉమర్ ఫరూఖ్ ను గృహ నిర్బంధంలో ఉంచారు.
పారామిలిటరీ బలగాలను, సీఆర్పీఎఫ్, పోలీసు సిబ్బందిని భారీగా ఇక్కడ మోహరించినట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది ఈ ప్రాంతాల్లో పాక్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇక్కడి యువకులు పాక్ జెండాలు పట్టుకుని తిరుగుతుంటారని ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన ఓ లేఖలో హెచ్చరించింది. జాతి వ్యతిరేఖ కార్యకలాపాలు జరిగే అవకాశాలున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.