బ్యాంకు మేనేజర్లు బుక్కయ్యారు..
ముంబై: దీపం ఉండగానే ఇల్లు చక‍్కబెట్టుకోవాలనేది పాత సామెత అయినప్పటికీ దీనికి పక్కాగా ఫాలో అవుతున్నారు కొందరు అక్రమార్కులు. పెద్దనోట్ల రద్దుతో పెద్ద మొత్తంలో లెక్కల్లో చూపని డబ్బు ఉన్నవారి పునాదులు కదులుతున్న నేపథ్యంలో.. అవకాశం ఉన్నప్పుడే అందినకాడికి వెనకేసుకోవాలని వారు చూస్తున్నారు. మరి ఈ అక్రమార్కులు ఏకంగా బ్యాంకుల్లో కీలక నిర్ణయాలు తీసుకునేవారైతే ఇక వారికి అడ్డేముంటుంది.
ముంబైలో ఇద్దరు యాక్సిస్ బ్యాంకు మేనేజర్లను మనీ లాండరింగ్ కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. బడాబాబుల లెక్కల్లో లేని డబ్బును సెటిల్ చేయడంలో వీరి ప్రమేయం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇద్దరు బ్యాంకు మేనేజర్లను సస్పెండ్ చేస్తూ యాక్సిస్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్ల రద్దును కొంత మంది బ్యాంకు అధికారులు బాగా క్యాష్ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు బ్యాంకు అధికారులపై ప్రత్యేక నిఘా ఉంచారని తెలుస్తోంది.