ఒంటరి మహిళలకు రూములివ్వని నగరం
కలల నగరంగా ప్రసిద్ధి చెందిన ముంబైలో ఒంటరి మహిళలకు రూములు దొరకడం కనాకష్టం. నేరస్థులకు కూడా రూములు ఇస్తారుగానీ చదువు కోసమో, ఉద్యోగం రీత్యానో నగరంలో ప్రవేశించిన ఒంటరి మహిళలకు (పెళ్లయినా, కాకున్నా) రూములు అద్దెకిచ్చేందుకు ఎవరూ ముందుకు రారు. ఒకవేళ ఇచ్చినా రూల్స్ పుస్తకాన్ని తీసి ముందుంచుతారు. సాయంత్రం చీకటి పడేలోగా ఇంటికి చేరుకోవాలి. మగవాళ్లు ఎవరూ ఇంటికి రాకూడదు. ఆడవాళ్లతోనైనా సరే వీకెండ్ పార్టీలు పెట్టుకోకూడదు. దమ్ము కొట్టకూడదు. మద్యం తాగరాదు. మాంసం వండుకోరాదు. బయటకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు సెక్యూరిటీ గార్డు దగ్గరున్న రిజిస్టర్‌లో సంతకం చేయాలి. ఊరు నుంచి భర్త వచ్చినా సరే అపార్ట్‌మెంట్ రెసిడెంట్స్ కమిటీకి లేదా కార్యదర్శికి మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించాల్సిందే. లేకపోతే అనుమతించరు.
ముంబై మహానగరంలో అద్దెకు ఇచ్చేందుకు ఎన్నో అపార్ట్‌మెంట్లు, అసోసియేషన్లు, బ్రోకర్లు ఉన్నా.. ఒంటరి మహిళలకు మాత్రం ఇలాంటి తిప్పలు తప్పడం లేదు. ఫెమినిజంలో మనం ఎంతో ముందుకు వెళ్లామని చెప్పుకొంటున్న ఈ రోజుల్లో కూడా ఈ పరిస్థితి తప్పడం లేదని ఫిల్మ్ మేకర్ షికా మేకన్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రహ్మచారులైన మగవాళ్లకు కూడా అంత సులభంగా ఇళ్లు అద్దెకు ఇవ్వరని, ఒంటరిగా నివసించే ఆడవాళ్లంటే మాత్రం మరీ చులకన భావమని ఆమె చెప్పారు. అద్దె ఇంటి కోసం ఎన్నో అగచాట్లు పడాల్సి వస్తుందని, చివరకు అద్దెకు ఇచ్చినా అర్థరాత్రి వచ్చి తలుపు తట్టేవాళ్లు, తనిఖీలు చేసేవాళ్లు, వచ్చేటప్పుడు, పోయేటప్పుడు వెకిలి కామెంట్లు చేసే ఆకతాయిల బెడద కూడా ఎక్కువగానే ఉంటోందని ఆమె చెప్పారు.
తాను పది, పన్నెండేళ్ల క్రితం ముంబై నగరానికి వచ్చినప్పుడు కూడా ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నానని, ఇటీవల తన స్నేహితురాలికి కూడా ఇలాంటి ఇక్కట్లే ఎదరవడంతో ఈ అంశంపై 'బ్యాచ్‌లర్ గర్ల్స్' అనే టైటిల్‌తో ఓ డాక్యుమెంటరీ తీశానని, దాన్ని త్వరలోనే విడుదల చేస్తానని షికా మేకన్ తెలిపారు.