బదౌన్ ఘటన తరహాలో మళ్లీ దారుణం
బహ్రయిచ్(యూపీ): వరుస అత్యాచార ఘటనలతో అరాచక రాష్ర్టంగా పేరు తెచ్చుకుంటున్న ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు అమ్మాయిలపై అఘాయిత్యం జరిపి చెట్టుకు ఉరేసిన బదౌన్ ఘటనను తలపిస్తూ బుధవారం బహ్రయిచ్ జిల్లాలో మరో ఘటన జరిగింది. వెనుకబడిన వర్గానికి చెందిన ఓ 45 ఏళ్ల మహిళను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం జరిపి ఇక్కడి రాణీపూర్ ప్రాంతంలో ఆమె చీరతోనే చెట్టుకు ఉరేశారు. స్థానిక లిక్కర్ మాఫియాపై ఆమె ఫిర్యాదు చేసినందుకే ఈ దారుణానికి ఒడిగట్టారన్న వాదన వినిపిస్తోంది. కాగా, మంగళవారం రాత్రి నుంచే బాధితురాలు కనిపించకుండా పోయిందని అదనపు ఎస్పీ సునీల్‌కుమార్ తెలిపారు. లోనియన్‌పూర్ గ్రామానికి చెందిన ఆమె చికిత్స కోసం లక్నో వెళుతూ అవసరం నిమిత్తం తన కొడుకు ఫోన్ చేయడంతో బహ్రయిచ్‌లో ఆగిపోయింది.
తల్లిని తిరిగి ఇంటికి తీసుకువచ్చేందుకు అతను అక్కడికి వెళ్లే సరికే ఆమె కనిపించకుండా పోయింది. తర్వాత ఆమె ఓ చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. దీనిపై ఆమె కుటుంబసభ్యులు ఐదుగురిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీ సులకు ఫిర్యాదు చేశారు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు, దర్యాప్తు అధికారులు తెలిపారు.
రంగంలోకి హైకోర్టు, సీబీఐ: యూపీ దారుణాలపై అలహాబాద్ హైకోర్టు స్పందించింది. బదౌన్ ఘటనపై నమోదైన కేసు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాలని నిర్ణయించింది. ఈ ఘటనతో పాటు గత ఆరు వారాల్లో రాష్ర్టవ్యాప్తంగా చోటుచేసుకున్న అత్యాచార ఘటనలపై నమోదైన ఇతర కేసులకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. మరోవైపు బదౌన్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.
యూపీలో మరో ఘోరం
Published Thu, Jun 12 2014 5:34 AM | Last Updated on Sat, Sep 2 2017 8:42 AM
Advertisement