'మోదీజీ.. ముందు తాగుడు మాన్పించండి'
పాలము: ప్రధాని నరేంద్రమోదీపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తనదైన శైలిలో మరోసారి విమర్శలు కురిపించారు. యోగాపై ధ్యాస పెట్టే ముందు మద్యం గురించి ఆలోచించాలని అన్నారు. మద్యపాన నిషేధం చేయకుండా యోగా నిష్ఫ్రయోజనం అని చెప్పారు. 'యోగాలో మొదటి నిబంధన మద్యపానాన్ని వినియోగానికి దూరం చేయడం. నిజంగా మీకు యోగాపై అంత తీవ్రమైన ఆలోచన ఉన్నట్లయితే ముందు మద్యంపై నిషేధాన్ని విధించండి' అంటూ ఆయన అన్నారు. యోగా అనేది ఏ ఒక్కరోజో గుర్తు చేసుకునేది కాదని, ఒక్కరోజు చేసే పని కాదని, అది జీవిత క్రమంలో నిత్యం జరగాల్సిన ప్రక్రియ అని చెప్పారు.
'ప్రధాని మోదీ ఎప్పటి నుంచి యోగా చేస్తున్నారో నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఎన్నో ఏళ్లుగా చేస్తున్నా.. ఆసనా, ప్రాణయామ, యోగా నిద్రాణ్' చేస్తుంటా. యోగా మొదటి నిబంధన మద్యపానానికి దూరంగా ఉండటం. యోగా డే సందర్భంగా ఆ నిర్ణయం తీసుకోలేకుంటే ఆ యోగా విఫలమే' అని చెప్పారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో నితీశ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
పాలములోని పార్టీ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ నితీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్లో మద్యపానం నిషేధాన్ని అమలుచేయాలని జేడీయూ డిమాండ్ చేస్తుందని చెప్పారు. తాను గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని పొందడానికి అత్యంత కీలకమైన అంశం ఇదేనని చెప్పారు. జార్ఖండ్తో ఉన్న సరిహద్దులో లిక్కర్ షాపులు ఏర్పాటుచేయడం వల్ల బిహార్లో మద్యపాన నిషేధం గడ్డు సమస్యగా మారిందని చెప్పారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో మద్యపానం నిషేధించాలని అన్నారు.