Chief minister nitish kumar
-
నేను కట్నం తీసుకోలేదు తెలుసా!
సాక్షి : కట్నం ప్రస్తావన లేని పెళ్లిళ్లకు మాత్రమే తనని ఆహ్వానించాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చెబుతున్నారు. సోమవారం తన నివాసంలో లోక్ సంవాద్(ప్రజలతో ముఖాముఖి) నిర్వహించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కట్నం తీసుకునే పెళ్లిళ్లకు నేను వెళ్లను. మీరూ వెళ్లకండి. మేం కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నాం అని బహిరంగంగా ఓ ప్రకటన చేయండి చాలూ. మీ పెళ్లికి హాజరవుతా అని నితీశ్ చెప్పారు. ఇంతకీ మీరు కట్నం తీసుకున్నారా? అన్న ప్రశ్నకు నితీశ్ బదులిచ్చారు. తన వివాహం 1973లో జరిగిందని.. ఒక్క పైసా కూడా కట్నం తీసుకోలేదని.. పైగా కొందరు సోషలిస్ట్ లీడర్లు కార్యక్రమానికి హాజరై కట్నం వ్యతిరేక ప్రసంగాలు చేశారన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. 1973 లాలా లజపత్ రాయ్ హాల్లో జరిగిన ఆ వేడుకను గుర్తు చేసినందుకు పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలియజేసినప్పటికీ.. పదేళ్ల క్రితం తన భార్య చనిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన కాస్త కలత చెందారు. కాగా, వరకట్న చావులు, గృహ హింసలో అగ్రస్థానంలో బిహార్ ఉందని.. వరకట్న నిషేధం దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని... అందుకు ప్రజలు కూడా సహకరించాలని నితీశ్ కోరారు. -
ఇప్పుడంతా మందు మరిచి పాల వైపు..
పట్నా: తమ రాష్ట్రంలో మద్యంపై నిషేధం విధించిన తర్వాత పాల కొనుగోలు శాతం పెరిగిందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. పాల కొనుగోళ్ల శాతం గత ఏడు నెలల్లోనే 11శాతం పెరిగినట్లు ఆయన చెప్పారు. పశ్చిమ చంపారన్ జిల్లాలో నిశ్చయ యాత్ర సందర్భంగా నిర్వహించిన చేతన సభలో ఆయన మాట్లాడుతూ స్వీట్లు, తేనెవంటివాటి వాడకం పెరగడం కూడా ఆల్కహాల్ నిషేధం వల్లేనని చెప్పారు. గతంలో దాదాపు రూ.10వేల కోట్లు మద్యం కోసం ప్రజలు ఖర్చు చేసేవారని, ఇప్పుడు పాలు, పండ్లను కొనుగోలు చేస్తూ ఆరోగ్యం కోసం ఖర్చు చేసుకుంటున్నారని, ఇది మంచి పరిణామం అని అన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న మద్యపాన నిషేధ చట్టంపై అభిప్రాయాలు తెలుసుకోవడమే నిశ్చయ యాత్ర ప్రధాన ఉద్దేశమని అన్నారు. -
మరింత కఠినంగా నితీశ్ నిర్ణయం
న్యూఢిల్లీ: బిహార్ ప్రభుత్వం ఏప్రిల్ ప్రవేశపెట్టిన ప్రొహిబిషన్ చట్టం చెల్లదని పట్నా హైకోర్టు కొట్టి వేసిన రెండు రోజుల్లేనే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరో కొత్త ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ చట్టం 2016 తీసుకొచ్చారు. ఈ చట్టం నేటి నుంచి (అక్టోబర్ 2) అమలవుతుందని అన్నారు. 'ఇప్పుడు ప్రజలెవరు మద్యంపై డబ్బును గతంలో మాదిరిగా ఖర్చు చేయడం లేదు. ఆ డబ్బు ఆర్థిక పరిస్థితిని నిలదొక్కుకునేందుకు ఉపయోగిస్తున్నారు. ది బిహార్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ చట్టం 2016 ఈ అక్టోబర్ 2 నుంచి అమలవుతుంది. దీని ప్రకారం బిహార్ లో పూర్తిగా మద్యం నిషేధం. హైకోర్టు ఇచ్చిన తీర్పు గతంలో ఏప్రిల్ లో తీసుకొచ్చిన పాత చట్టానికి సంబంధించినది' అని నితీశ్ అన్నారు. ప్రత్యేక కోర్టులు మంజూరు చేసిన బెయిల్స్ మాత్రమే ఒక వ్యక్తిని విడుదల చేసేందుకు అనుమతిస్తారని, స్టేషన్ బెయిల్స్ పనిచేయవని అన్నారు. అంతేకాదు, ఏ ఇంటి ముందు బెల్లానికి సంబంధించిన ఆనవాళ్లు, ద్రాక్షాలు గుర్తించిన ఎలాంటి ప్రశ్నలు వేయకుండానే మద్యం తయారు చేసేవారిగా పరిగణించి అరెస్టు చేసే అవకాశం ఈ చట్టంతో రానుందట. -
'ఆయన ప్రధాని అయితే నాకు ఫుల్ హ్యాపీ'
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు తమ మద్దతు వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా ఉంటుందని డిప్యూటీ సీఎం ఆర్జేడీ అధినేత తనయుడు తేజస్వీ యాదవ్ అన్నారు. ఆయన ప్రతిపక్షాల తరుపు నుంచి ప్రధాని అభ్యర్థిగా ముందుకొచ్చినా తమకు సంతోషమే అని, తన తండ్రి లాలూ కూడా దీనికి సమ్మతంగా ఉన్నారని ఆయన చెప్పారు. 'కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా ఉన్నారు. కానీ, నితీశ్ కుమార్ వచ్చే ఎన్నికల్లో ప్రధానిగా మారితే అది నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషాన్నిస్తుంది' అని అన్నాడు. ప్రధాని నరేంద్రమోదీకంటే కూడా సీఎం నితీశ్ ప్రధానిగా చాలా సమర్థులు అని, ఆయన నిజంగా ఓ ప్రధాని హోదాకు తగిన అర్హుడని తేజస్వి చెప్పాడు. 2019 ఎన్నికల్లో మాత్రం మరోసారి నరేంద్రమోదీ ప్రధానిగా గెలవలేరు అని జోస్యం చెప్పారు. నితీశ్ కుమార్ తనకు ఓ రాజకీయ గురువు అని గౌరవాన్ని చాటుకున్నాడు. అంతకుముందు లాలు ప్రసాద్ యాదవ్ కూడా రాహుల్ ప్రధాని అభ్యర్థినా కాదా అనే విషయం తనకు తెలియదని, కానీ.. నితీశ్ మాత్రం ప్రధాని పదవి అలంకరించేందుకు తగిన ముడిసరుకుకలవాడని అన్నారు. -
'మోదీజీ.. ముందు తాగుడు మాన్పించండి'
పాలము: ప్రధాని నరేంద్రమోదీపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తనదైన శైలిలో మరోసారి విమర్శలు కురిపించారు. యోగాపై ధ్యాస పెట్టే ముందు మద్యం గురించి ఆలోచించాలని అన్నారు. మద్యపాన నిషేధం చేయకుండా యోగా నిష్ఫ్రయోజనం అని చెప్పారు. 'యోగాలో మొదటి నిబంధన మద్యపానాన్ని వినియోగానికి దూరం చేయడం. నిజంగా మీకు యోగాపై అంత తీవ్రమైన ఆలోచన ఉన్నట్లయితే ముందు మద్యంపై నిషేధాన్ని విధించండి' అంటూ ఆయన అన్నారు. యోగా అనేది ఏ ఒక్కరోజో గుర్తు చేసుకునేది కాదని, ఒక్కరోజు చేసే పని కాదని, అది జీవిత క్రమంలో నిత్యం జరగాల్సిన ప్రక్రియ అని చెప్పారు. 'ప్రధాని మోదీ ఎప్పటి నుంచి యోగా చేస్తున్నారో నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఎన్నో ఏళ్లుగా చేస్తున్నా.. ఆసనా, ప్రాణయామ, యోగా నిద్రాణ్' చేస్తుంటా. యోగా మొదటి నిబంధన మద్యపానానికి దూరంగా ఉండటం. యోగా డే సందర్భంగా ఆ నిర్ణయం తీసుకోలేకుంటే ఆ యోగా విఫలమే' అని చెప్పారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో నితీశ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాలములోని పార్టీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ నితీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్‌లో మద్యపానం నిషేధాన్ని అమలుచేయాలని జేడీయూ డిమాండ్ చేస్తుందని చెప్పారు. తాను గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని పొందడానికి అత్యంత కీలకమైన అంశం ఇదేనని చెప్పారు. జార్ఖండ్‌తో ఉన్న సరిహద్దులో లిక్కర్ షాపులు ఏర్పాటుచేయడం వల్ల బిహార్‌లో మద్యపాన నిషేధం గడ్డు సమస్యగా మారిందని చెప్పారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో మద్యపానం నిషేధించాలని అన్నారు. -
ప్రత్యేక హోదాను పట్టించుకోని టీడీపీ
నరసరావుపేట వెస్ట్: రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించాలనే చిత్తశుద్ది తెలుగుదేశం ప్రభుత్వానికి ఏమాత్రంలేదని కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వర్లు విమర్శించారు. మాజీమంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి గృహంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేకహోదా కోసం తాము చేసిన ఢిల్లీ పర్యటనలో సానుకూలత లభించిందన్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, యువనాయకుడు రాహూల్‌గాంధీ, సీపీఎం, సీపీఐ అగ్రనేతలు సీతారాం ఏచూరి, సురవరం సుధాకరరెడ్డి, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌లకు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ వినతిపత్రాలు సమర్పించామన్నారు. ఒక్క ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమకు ఇంటర్వ్యూ ఇవ్వలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యేకహోదా ఇవ్వాలనే ఉద్దేశ ం కన్పించటంలేదని, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయట్లేదన్నారు. రాష్ట్రం నుంచి వెళ్లిన తమ బృందానికి రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఢిల్లీలో ముఖ్యులను కలిసేందుకు సహాయ సహకారాలు అందజేశారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభించేంతవరకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై పోరాటం చేస్తుందని చెప్పారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు పెనుగొండ వెంకటేశ్వరరావు, రొంపిచర్ల మండల అధ్యక్షుడు పడాల చక్రారెడ్డి, పట్టణ అధికార ప్రతినిధి దుర్గాబాబు, పీసీసీ సంయుక్త కార్యదర్శి వి.లకా్ష్మరెడ్డి, కపలవాయి రమేష్‌చంద్రదత్, ఏటీఎం బాషా పాల్గొన్నారు. -
ఏప్రిల్ 1 నుంచి బిహార్‌లో మద్యనిషేధం
పట్నా: బిహార్‌లో మద్య నిషేధం అమలు చేస్తున్నట్లు గురువారమిక్కడ నిర్వహించిన ఓ అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ప్రకటించారు. 2016 ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్రంలో మద్య నిషేధం అమలులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని గత జూలైలో ఆయన హామీ ఇవ్వడం తెలిసిందే. అత్యంత పేదలు మద్యపానానికి అలవాటుపడడం వల్ల అది వారి కుటుంబాలపైన, వారి పిల్లల విద్యపైన తీవ్ర ప్రభావం చూపుతోందని నితీశ్ అన్నారు. అంతేగాక మద్యపానం పెరిగిపోవడం కూడా మహిళలకు వ్యతిరేకంగా గృహహింసకు దారితీస్తోందని, నేరాల పెరుగుదలకు కారణమవుతోందని చెప్పారు. వచ్చేఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్రంలో ఎక్కడా మద్యం దొరకకుండా చూస్తామని సీఎం పేర్కొన్నారు. -
నితీశ్‌ను చూసైనా నేర్చుకోండి
సీఎంకు వాసిరెడ్డి పద్మ సూచన సాక్షి, హైదరాబాద్: బీహార్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీవల్ల ఏమీ ప్రయోజనం లేదంటూ తమకు ప్రత్యేక హోదానే కావాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ డిమాండ్ చేస్తుంటే మన రాష్ట్రంలో చంద్రబాబు మాత్రం ప్రత్యేకహోదా వద్దు, ప్యాకేజీ ఇచ్చినా చాలంటూ ప్రాధేయపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. నితీష్‌ను చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని సూచించింది. పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం సాధారణంగా రాష్ట్రాల్లో అమలు చేసే పథకాల ఖర్చు చేసే మొత్తాలు కాకుండా బీహార్‌కు ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీలో అదనంగా చూపించింది కేవలం రూ.5000 కోట్లకు మించి లేదని గణాంకాలతో నితీష్‌కుమార్ వివరించారని గుర్తుచేశారు. అయినా చంద్రబాబు మాత్రం విభజన తరువాత రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను కాదని, కేంద్రం ప్యాకేజీతో సరిపెట్టాలని చూస్తుంటే సరేనంటున్నారని దుయ్యబట్టారు. కేంద్రం ఏదో ఇస్తున్నట్టు, ఈయనేదో మోసుకొస్తున్నట్టు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్పటి ప్రధాని ఇచ్చిన హామీతో రాష్ట్రం రెండు ముక్కలయినా ఏపీకి హోదావల్ల న్యాయం జరుగుతుందని నమ్మకం పెట్టుకున్న ప్రజలు గుండెలు ఇప్పుడు ఆగిపోతున్నాయన్నారు. హోదా లేని రాష్ట్రాలకు రాయితీలు ఇచ్చిన దాఖలాలు లేవు ప్రత్యేక హోదా కల్పించబడిన రాష్ట్రాలకు తప్ప దేశంలో ఇతర రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీల పేరుతో ప్యాకేజీ ఇచ్చిన దాఖలాలు లేవని పద్మ తెలిపారు. ఇప్పటివరకు హోదా దక్కిన 11 రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం రాయితీలు కల్పించిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రత్యేక హోదా డిమాండ్‌తో శనివారం నిర్వహించిన తలపెట్టిన బంద్‌ను జయప్రదం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. చంద్రబాబు తన వంతుగా బంద్‌ను విజయవంతం చేసి, ప్రజల ఆలోచనలను కేంద్రానికి వివరించడం ద్వారా మన రాష్ట్ర హక్కును సాధించాలని పద్మ సూచించారు. -
'మాలో ఎవరు అహంకారినో మీరే తేల్చండి'
పాట్నా: బీహార్ ఎన్నికలు దేశ రాజకీయాల్లో వేడిని రాజేస్తున్నాయి. జేడీయూ బీజేపీ మధ్య పరస్పరం మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఎన్నికల నేపథ్యంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ అహంకారినో, తాను అహంకారినో మీడియానే తేల్చాలని కోరారు. మీరు ఏది చెప్తే అదే న్యాయమని తాను భావిస్తానని మీడియాతో అన్నారు. నితీశ్ కుమార్ అహంకారి అని బీజేపీ ఆరోపించడం పట్ల శుక్రవారం ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. 'మీరు నన్ను ఎన్ని ప్రశ్నలయినా అడగొచ్చు.. వాటన్నింటికి సమాధానాలు చెప్పిన తర్వాతే నేను అక్కడి నుంచి వెళ్లిపోతాను. కానీ, మీకు ప్రధానిని అలా ప్రశ్నించే అవకాశం ఉంటుందా?' అని మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. ఈ ఒక్క విషయం ద్వారానే ఎవరు అహంకారి అనే విషయం చెప్పవచ్చని తెలిపారు. పాట్నాలోనూ, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోనూ అనేక బీజేపీ హోర్డింగ్‌లు వెలిశాయి. నేరాలు, అహంకారంతో నిండిన పరిపాలన చేసేవారితో బీహార్ ప్రజలు ముందుకు వెళ్తారా? అంటూ బీజేపీ ఆ హోర్డింగ్‌లలో ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో నితీశ్ స్పందించారు. -
నితీశ్‌కు కేజ్రీవాల్ మద్దతు
న్యూఢిల్లీ: బిహార్‌లో సీఎం నితీశ్‌కుమార్‌కు సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీలో బుధవారం ఓ కార్యక్రమంలో వీరిద్దరూ ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. మోదీ బిహార్‌కు రూ. 1.25లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించడాన్ని కేజ్రీవాల్ తప్పుబట్టారు. ఆయన రూ.1.25పైసలు కూడా ఇవ్వరని అన్నారు. బిహార్ ఎన్నికల్లో పోటీ చేయొద్దనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. ఢిల్లీ నుంచి బిహార్‌కు వలస వెళ్లిన ప్రజలు నితీశ్ గెలుపునకు కృషి చేయాలని కోరారు. బిహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ కాదని, ప్రత్యేక హోదా కల్పించాలన్నారు. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా డిమాండ్‌ను నితీశ్ సమర్థించారు. బీజేపీలోకి జేడీయూ ఎమ్మేల్యేలు పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో నితీశ్ నేతృత్వంలోని జేడీయూకి చెందిన నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు తమ అనుచరులతో కలిసి బుధవారం బీజేపీలో చేరారు. బిహార్ అభివృద్ధిని కాంక్షించిన ఎమ్మెల్యేలను నితీశ్‌కుమార్ పలు రకాలుగా వేధించారని బీజేపీ బిహార్ అధ్యక్షుడు మంగల్‌పాండే ఆరోపించారు. -
విలీనానికి జేడీయూ సమ్మతి
పట్నా: ఒకప్పటి జనతా పరివార్ పార్టీల విలీన ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. ఈ కూటమిలో కీలకమైన ఆర్జేడీ ఇప్పటికే విలీనానికి ఆమోదం తెలపగా, మరో ముఖ్యమైన పార్టీ జేడీయూ కూడా అధికారికంగా తన సమ్మతిని ప్రకటించింది. బుధవారం రాత్రి బిహార్ సీఎం నితీశ్ కుమార్ నివాసంలో జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీ అధినేత శరద్ యాదవ్, నితీశ్‌లకు బాధ్యతలు అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.