సాక్షి : కట్నం ప్రస్తావన లేని పెళ్లిళ్లకు మాత్రమే తనని ఆహ్వానించాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చెబుతున్నారు. సోమవారం తన నివాసంలో లోక్ సంవాద్(ప్రజలతో ముఖాముఖి) నిర్వహించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కట్నం తీసుకునే పెళ్లిళ్లకు నేను వెళ్లను. మీరూ వెళ్లకండి. మేం కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నాం అని బహిరంగంగా ఓ ప్రకటన చేయండి చాలూ. మీ పెళ్లికి హాజరవుతా అని నితీశ్ చెప్పారు. ఇంతకీ మీరు కట్నం తీసుకున్నారా? అన్న ప్రశ్నకు నితీశ్ బదులిచ్చారు. తన వివాహం 1973లో జరిగిందని.. ఒక్క పైసా కూడా కట్నం తీసుకోలేదని.. పైగా కొందరు సోషలిస్ట్ లీడర్లు కార్యక్రమానికి హాజరై కట్నం వ్యతిరేక ప్రసంగాలు చేశారన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
1973 లాలా లజపత్ రాయ్ హాల్‌లో జరిగిన ఆ వేడుకను గుర్తు చేసినందుకు పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలియజేసినప్పటికీ.. పదేళ్ల క్రితం తన భార్య చనిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన కాస్త కలత చెందారు. కాగా, వరకట్న చావులు, గృహ హింసలో అగ్రస్థానంలో బిహార్ ఉందని.. వరకట్న నిషేధం దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని... అందుకు ప్రజలు కూడా సహకరించాలని నితీశ్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment