పాట్నా: బీహార్ ఎన్నికలు దేశ రాజకీయాల్లో వేడిని రాజేస్తున్నాయి. జేడీయూ బీజేపీ మధ్య పరస్పరం మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఎన్నికల నేపథ్యంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ అహంకారినో, తాను అహంకారినో మీడియానే తేల్చాలని కోరారు. మీరు ఏది చెప్తే అదే న్యాయమని తాను భావిస్తానని మీడియాతో అన్నారు. నితీశ్ కుమార్ అహంకారి అని బీజేపీ ఆరోపించడం పట్ల శుక్రవారం ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
'మీరు నన్ను ఎన్ని ప్రశ్నలయినా అడగొచ్చు.. వాటన్నింటికి సమాధానాలు చెప్పిన తర్వాతే నేను అక్కడి నుంచి వెళ్లిపోతాను. కానీ, మీకు ప్రధానిని అలా ప్రశ్నించే అవకాశం ఉంటుందా?' అని మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. ఈ ఒక్క విషయం ద్వారానే ఎవరు అహంకారి అనే విషయం చెప్పవచ్చని తెలిపారు. పాట్నాలోనూ, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోనూ అనేక బీజేపీ హోర్డింగ్లు వెలిశాయి. నేరాలు, అహంకారంతో నిండిన పరిపాలన చేసేవారితో బీహార్ ప్రజలు ముందుకు వెళ్తారా? అంటూ బీజేపీ ఆ హోర్డింగ్లలో ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో నితీశ్ స్పందించారు.
'మాలో ఎవరు అహంకారినో మీరే తేల్చండి'
Published Fri, Aug 28 2015 5:19 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement